Rishi Panchami Vrat Katha : ఒకసారి ధర్మరాజు శ్రీకృషునితో అన్ని వ్రతములలోకి ఉత్తమమైనది ఏది? స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే తెలిసి తెలియక చేసిన దోషములు పోతాయి? అని అడుగగా ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా! 'చేసిన పాపములు పోగొట్టే ఉత్తమమైన వ్రతమొకటి కలదు. అదే ఋషి పంచమి వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను వినుము' అంటూ చెప్పసాగెను.
పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు సుశీల ఈమె పతివ్రత. ఈ దంపతులకు సుభీషణుడు అను కొడుకు, ఒక కుమార్తె ఉండేవారు. సుభీషణుడు వేద వేదాంగాలను చదివి పండితుడయ్యాడు. కుమార్తెను ఒక బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించారు. కర్మవశాత్తు ఆమె వైధవ్యము పొంది తన తండ్రి ఇంట్లో కాలము గడుపుచుండెను. ఉదంకుడు తన కుమార్తె పరిస్థితికి బాధ పడుచు భార్యను, కుమార్తెను తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ అడవులలోనే నివసిస్తూ ఉండేవాడు.
ఉదంకుని కుమార్తె ఒకనాటి రాత్రి తన తండ్రికి పరి చర్యలు చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ద రాత్రి వేళ ఆమె దేహమంతా పురుగులు పట్టాయి .ఇలా శరీరమంతా పురుగులతో నిండియున్న ఆమెను చూసి ఉదంకుని శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. కుమార్తె దుస్థితి చూసి తల్లి బాధతో ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకొని తన భర్త ఐన ఉదంకుని దగ్గరకు పోయి, జరిగినదంతా వివరించి చెప్పి, ఇందుకు కారణం తెలుపమని కోరింది. ఉదంకుడు కొంత సేపు ధ్యాన ముద్రలో ఉండి తన దివ్యదృష్టితో ఆమె పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకొని తన భార్యతో ఇలా చెప్పాడు.
ఓ ప్రాణేశ్వరీ! 'మన కుమార్తె తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా జన్మించి కూడా రజస్వల అయిన సమయంలో ఇంటికి దూరంగా ఉండక ఇంటి పనులు అన్ని చేయుచూ అన్నం, కూర, పప్పు వంటి భోజన పదార్థాలు, వంట పాత్రలు తాకి పాపం చేసింది. ఆ పాప ఫలితంగా కలిగిన దోషము వలన ఈ జన్మలో ఆమె శరీరమంతా ఇలా పురుగులు వ్యాపించాయి. ఎన్ని జన్మల తరువాత అయిన పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు ఆమె ఆ దోష ఫలితాన్ని అనుభవిస్తోంది' అని చెప్పాడు.