Pray Dakshinamurthy On Thursday : వారంలో ఐదో రోజైన గురువారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రత్యేకంగా గురువు ఆరాధన కోసమే నిర్దేశించింది గురువారం. దేవగురువైన బృహస్పతి అధిపతిగా ఉన్న గురువారం ఎంతో విశిష్టమైనది. శుభ కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణిస్తారు. మరి ఈ గురువారం చేయాల్సిన దక్షిణామూర్తి ఆరాధన గురించి తెలుసుకుందాం.
మౌనమే శరణ్యం
పరమశివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపమని శివపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సకల విద్యలకు ఆది గురువైన దక్షిణామూర్తి తన శిష్యులకు మౌనంగానే బోధనలు చేస్తాడంట! అందుకే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వానాం అంటారు. అందుకే కదా మౌనాన్ని మించిన భాష లేదని పెద్దలు అంటారు. వంద మాటలు చెప్పలేని మాట ఒక్క మౌనంతోనే వెల్లడించవచ్చని గురువులు అంటారు. అందుకే జ్ఞానం కోరుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు.
దక్షిణామూర్తి అని ఎందుకు అంటారు
దక్షిణామూర్తి అంటే సంస్కృతంలో దక్షిణ ముఖంగా వెలసిన స్వామి అని ఒక అర్ధం. అయితే మరో అర్ధం ప్రకారం దాక్షిణ్యం అంటే అపారమైన కరుణను తన భక్తులపై ప్రసరింప చేసేవాడు అని అర్ధం. అందుకే ఏ ఆలయంలో చూసినా దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగానే ఉంటాడు.
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి స్వరూపం
పరమశివుని అంశగా వెలసిన జ్ఞాన దక్షిణామూర్తి నాలుగు చేతులతో ఓ మర్రిచెట్టు కింద కూర్చున్నట్లుగా ఉంటుంది. జింక చర్మం ఆసనంగా కలిగి ఉన్న దక్షిణామూర్తి చుట్టూ మునులు, రుషులు కూర్చొని జ్ఞానాన్ని పొందుతుంటారు. దక్షిణామూర్తి స్వామి పాదాల కింద అజ్ఞానమనే రాక్షసుడు అణిచివేసి ఉంటాడు. దీని అర్ధం ఏమిటంటే దక్షిణామూర్తిని నిర్మలమైన మనసుతో ఆశ్రయిస్తే మన అజ్ఞానం పటాపంచలై పోతుంది.