తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వెంకన్నే కాదు పద్మావతి కూడా గరుడ వాహనంపై విహారం- భూమిపైకి ముక్కోటి దేవతలు! - PADMAVATHI BRAHMOTSAVAM 2024

గరుడ వాహనంపై శ్రీహరి పట్టపురాణి- విశిష్టత ఇదే

Padmavathi Brahmotsavam
Padmavathi Brahmotsavam (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 4:55 AM IST

Padmavathi Brahmotsavam Garuda Vahanam Significance :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సాయంత్రం అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు అలంకార విశేషం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన డిసెంబర్ 3 మంగళవారం రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మవారి వాహన సేవలలో కీలకమైన గరుడ వాహన సేవ విశిష్టత ఇదే.

గరుడ వాహన సేవ విశిష్టత
దాస్యానికి ప్రతిరూపం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహనం ద్వారా శ్రీహరి దేవేరి పద్మావతి దాసానుదాస ప్రపత్తికి తాను దాసురాలినని తెలియజేస్తారు. అంతేగాదు జ్ఞానవైరాగ్య సిద్ధి కోసం తపించే మానవులు ఈ గరుడ సేవను తప్పకుండా దర్శించాలి. జ్ఞాన వైరాగ్యాలనే రెక్కలుగా చేసుకొని అమ్మవారిని తన భుజస్కందాలపై మోస్తూ విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవను చూడటానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు.

తిరుచానూరుకు చేరనున్న శ్రీవారి లక్ష్మీకాసుల హారం
తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తిక బ్ర‌హ్మోత్స‌వాల్లో జరుగనున్న గజవాహన, గ‌రుడ వాహ‌న‌సేవ‌లో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి మూల విరాట్టుకు అలంకరించే అతి అమూల్యమైన ఆభరణం ల‌క్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకొస్తారు. తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని వైభ‌వోత్స‌వ మండ‌పానికి తీసుకువచ్చి అక్కడ నుంచి ప్రత్యేక వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తరలిస్తారు. ఆలయానికి చేరుకున్నాక హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్తారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్తారు. ఈ హారాన్ని గజ వాహన సేవలో, గరుడ సేవలో అమ్మవారికి అలంకరిస్తారు.

శ్రీవారిని దర్శించిన ఫలం
సాక్షాత్తూ శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించిన హారాన్ని అమ్మవారికి గరుడ వాహన సేవలో అలంకరిస్తారు కాబట్టి గరుడ వాహనంపై అమ్మవారిని దర్శిస్తే సాక్షాత్తూ శ్రీనివాసుని దర్శించినట్లే అని వేంకటాచల మహత్యంలో వివరించారు.

గరుడ వాహన దర్శన ఫలం
అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవలో పాల్గొనే భక్తులు ఇటు అమ్మవారితో పాటు, అటు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని జ్ఞానం లభిస్తుందని పురాణం వచనం. గరుడ వాహనంపై విహరించే శ్రీ పద్మావతీ దేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details