Padmavathi Brahmotsavam Chandra Prabha Vahanam Significance : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు సాయంత్రం అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారు, ఆ వాహన సేవ విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
చంద్రప్రభ వాహనంపై చంద్ర సహోదరి!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
చంద్రప్రభ వాహన సేవ విశిష్టత
కార్తిక బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి దేవి ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించిన సమయంలో అందులో నుంచి కొన్ని అద్భుతాలు ఉద్భవించాయి. చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి కూడా క్షీర సాగరం నుంచి ఉద్భవించారని పోతన రచించిన భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే శ్రీలక్ష్మిని చంద్ర సహోదరిగా వ్యవహరిస్తారు. ఆ శ్రీలక్ష్మినే ఈ పద్మావతి దేవి.
మనశ్శాంతి రోగ నాశనం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. ఔషధాలను తేజోవంతం చేసే శక్తి కలవాడు. అందుకే చంద్రప్రభ వాహనంపై ఊరేగే చంద్ర సహోదరి శ్రీ పద్మావతి దేవిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమస్త ఔషధీ తత్వంతో రోగ నాశనం జరుగుతుంది. అంతేకాదు చంద్రప్రభ వాహనంపై ఊరేగే అమ్మవారి దర్శనంతో సకల పాపాలు తొలగి, సమస్త సంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.