తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

నవరాత్రుల్లో అమ్మవారు - ఏ రోజున ఏ రంగు వస్త్రాల్లో దర్శనమిస్తారో తెలుసా? - Dasara Navaratri 2024 - DASARA NAVARATRI 2024

నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శమిస్తారు. అయితే, ఏ రోజున ఏ రంగు వస్త్రాలను అలంకరిస్తారు ? వాటి ప్రత్యేకతలు ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం.

Navratri Colours 2024
Navratri Colours 2024 List (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 12:22 PM IST

Navratri Colours 2024 List : దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె, పట్టణం, ఊరూ.. వాడా.. అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో.. దుర్గామాత విగ్రహాలు కొలువుదీరాయి. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజిస్తున్నారు. చాలా మంది ఈ నవరాత్రుల సమయంలో ఉపవాసం కూడా ఉంటారు. దీనివల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తమ కుటుంబంపై ఉంటుందని విశ్వసిస్తారు.

అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు.. 9 రోజులపాటు 9 రూపాలలో మహాశక్తి స్వరూపిణిని కొలుస్తాం. చెడుపై శక్తి సాధించిన విజయానికి గుర్తుగా పదో రోజున 'విజయదశమి' పండగని జరుపుకుంటాం. అయితే, నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు.. ఒక్కో అలంకారంలో.. ఒక్కో రంగు వస్త్రాలలో భక్తులకు దర్శమిస్తుంటారు. అమ్మవారి అలంకరణలో ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకత ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దుష్టశక్తుల ప్రభావం నుంచి మనల్ని రక్షించే ఆ దుర్గామాత తొమ్మిది రూపాలు ఏంటి ? అమ్మవారికి ఏ రోజున ఏ రంగు వస్త్రాలను అలంకరిస్తారు ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

మొదటి రోజు-పసుపు :

మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి దేవి అలంకారంలో పసుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. హిందూ సంప్రదాయాలలో పసుపు రంగును శుభసూచికంగా భావిస్తారు. అందుకే నవరాత్రులలో మొదటి రోజు దుర్గామాతని పసుపు రంగు వస్త్రాల్లో అలంకరిస్తారు.

రెండవ రోజు- అకుపచ్చ :

రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో.. అకుపచ్చ రంగు వస్త్రాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందట. అలాగే మనం ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తవుతాయి.

మూడవ రోజు-బూడిద రంగు :

మూడవ రోజు దుర్గామాత చంద్రఘంట దేవి అలంకారంలో.. బూడిద రంగు వస్త్రాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో కష్టాలన్నీ దూరమైపోతాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు.

నాలుగవ రోజు-నారింజ రంగు :

నాలుగవ రోజున దుర్గాదేవి కుష్మాండా దేవి అలంకారంలో.. నారింజ రంగు వస్త్రాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే పాజిటివ్​ ఆలోచనలు కలుగుతాయి.

ఐదవ రోజు- తెలుపు :

ఐదవ రోజున అమ్మవారు స్కందమాత అలంకారంలో తెలుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. తెలుపు రంగు శాంతికి చిహ్నంగా భావిస్తారు.

ఆరవ రోజు- ఎరుపు :

ఈ రోజున కాత్యాయని అలంకారంలో అమ్మవారు ఎరుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఎరుపు రంగు శక్తికి, భక్తికి ప్రతీకగా భావిస్తారు.

ఏడో రోజు- నీలం రంగు :

ఏడో రోజున ఆ దుర్గాదేవి కాళరాత్రి అలంకారంలో నీలం రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. కాళరాత్రి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి. అలాగే సంపద వృద్ధి చెందుతుంది.

ఎనిమిదో రోజు- గులాబీ రంగు :

ఈ రోజున అమ్మవారు మహా గౌరీ అలంకారంలో గులాబీ రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. గులాబీ రంగు ప్రేమను సూచిస్తుంది.

తొమ్మిదో రోజు- ఊదా రంగు (purple) :

తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో ఊదా రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఊదా రంగు భక్తిని, శ్రేయస్సును సూచిస్తుంది. ఇలా ఒక్కో రోజు అమ్మవారు ఒక్కోరూపంలో వివిధ రంగుల వస్త్రాధారణలో భక్తులకు దర్శనమిస్తుంది.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

శరన్నవరాత్రుల వేళ "అఖండ దీపం" వెలిగిస్తున్నారా? - ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదట!

నవరాత్రుల వేళ అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? - పూజకు ఏ పువ్వులు వాడకూడదు?

ABOUT THE AUTHOR

...view details