తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి' - Navaratri Kumari Puja

Kanya Puja 2024 : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో.. తొమ్మిది రోజులపాటు నియమనిష్టలతో దుర్గామాతను కొలుస్తారు. అయితే.. ఈ నవరాత్రుల సమయంలో చాలా మంది 'కుమారి పూజ' చేస్తుంటారు. ఈ పూజ ఎలా చేయాలో ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్​' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

Kanya Puja
Kanya Puja 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 10:15 AM IST

Navaratri Kumari Puja 2024 : నవరాత్రుల్లో ఏ రోజైనా సరే.. కుమారి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు.. సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కుమారి పూజ ఎలా చేయాలి?

కుమారి పూజ చేయడానికి 2 నుంచి 10 సంవత్సరాలలోపున్న బాలికను ఇంటికి పిలవాలి. ఆ తర్వాత బాలికను పీటపైన కూర్చోబెట్టి.. పాదాలను నీళ్లతో కడగాలి. ఆ తర్వాత కాళ్లకు పసుపు రాయాలి. పాదాలపై పూలు చల్లాలి. సుగంధ ద్రవ్యాలను బాలికకు పూయాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఆ తర్వాత బాలికకు కొత్త వస్త్రాలు ఇవ్వాలి. చివరగా అన్ని రకాల ఆహార పదార్థాలతో భోజనం తినిపించాలి. ఆ బాలికను సాక్షత్తూ బాల త్రిపురసుందరీ దేవి స్వరూపంగా భావించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి.. అష్టఐశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

  • 2 నుంచి 10 సంవత్సరాలలోపున్న బాలికలకు మాత్రమే కుమారి పూజ చేయాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.
  • అయితే, ఒక్కొక్క వయసున్నటువంటి బాలికను ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆ బాలికకు పూజ చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందట.

కుమారి పూజ : రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు. కుమారిని పూజిస్తే దారిద్య బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రెండు సంవత్సరాల బాలికను పూజించాలి.

త్రిమూర్తి :మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు. త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.

కళ్యాణి :నాలుగు సంవత్సరాలున్న బాలికను కళ్యాణి అని పిలుస్తారు. కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే నాలుగు సంవత్సరాల బాలికను ఇంటికి పిలిచి కన్యా పూజ చేయాలి.

రోహిణి : ఐదు సంవత్సరాలున్న బాలికను రోహిణి అని పిలుస్తారు. ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయట. ఇంట్లో ఎవరికైనా హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఉంటే ఐదు సంవత్సరాల బాలికకు పూజ చేయాలట.

కాళిక :ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అని పిలుస్తారు. కాళికను పూజిస్తే అంతర, బాహ్య శత్రు బాధలు తొలగిపోతాయి. శత్రువులు సమూలంగా నశిస్తారు.

చండిక :ఏడు సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు. చండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు.

శాంభవి :ఎనిమిది సంవత్సరాలున్న బాలికను శాంభవి అని పిలుస్తారు. శాంభవిని పూజిస్తే ప్రమోషన్​ వస్తుంది. రాజకీయాల్లో మంచి పేరు రావాలంటే శాంభవిని పూజించాలి.

దుర్గా :తొమ్మిది సంవత్సరాలున్న బాలికను దుర్గా అంటారు. వీరిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి.

సుభద్ర :పది సంవత్సరాలున్న బాలికను పూజిస్తే.. మనస్సులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఇలా నవరాత్రి ఉత్సవాల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్లు.. మీ కోరికను బట్టి 2-10 వయసు మధ్యలో ఉన్న బాలికను ఇంటికి పిలిచి.. ప్రత్యేకమైన కన్యా పూజ చేయాలని మాచిరాజు సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

దేవీ నవరాత్రుల నుంచి దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో పండగలే పండగలు!

'అక్టోబర్ 2న సూర్యగ్రహణం - ముందు రోజు ఇలా చేస్తే.. సొంత ఇంటి కల నేరవేరుతుంది'

ABOUT THE AUTHOR

...view details