తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

జాతకంలో నాగ దోషాలా? శుక్రవారం ఈ పూజ చేస్తే అంతా సెట్! - Nag Panchami 2024

Nag Panchami Puja Vidhi : జాతకంలో నాగ దోషాలు, కాలసర్ప దోషాలు ఉంటే జీవితం దుర్లభం అవుతుంది. ఏ పని సాఫీగా సాగదు. చేసే ప్రతి పనిలోనూ అవాంతరాలు ఉంటాయి. వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగక పోవడం వీటన్నింటికి నాగదోషాలే కారణం. రానున్న శ్రావణ శుక్రవారం నాగ పంచమి రోజు చేసే పూజలతో ఎలాంటి నాగ దోషాలైనా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆ వివరాలేమిటో ఈ కథనంలో చూద్దాం.

Nag Panchami 2024
Nag Panchami 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 4:23 PM IST

Nag Panchami Puja Vidhi : శ్రావణమాసంలో ఐదోరోజు అంటే శుద్ధ పంచమి రోజున నాగ పంచమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది నాగ పంచమి పండుగ శుక్రవారం 2024 9 ఆగస్టు 2024న వచ్చింది. ఈ నాగ పంచమి పండుగను భారతదేశంలోనే కాకుండా హిందువులు నివసించే ఇరుగు పొరుగు దేశాల్లో కూడా ఘనంగా జరుపుకోవడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.

కాల సర్ప దోషం అంటే ఏమిటి?
ఆర్యభట్టతో పాటు ప్రముఖ పండితులు పరిశోధించి రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో అన్ని గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. జాతకంలో ఈ దోషం ఉంటే ఆర్థిక ఇబ్బందులు, వివాహానికి ఆటంకం, సంతానం లేకపోవడం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.

కాల సర్ప దోష ప్రభావం ఇలా తగ్గించుకోవచ్చు!
శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజిస్తే నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం ఉంటే నాగ పంచమి పూజను నియమ నిష్టలతో చేస్తే రాహు-కేతువుల చెడు ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

నాగ పంచమి పూజకు శుభ సమయం
శ్రావణ శుద్ధ పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ గురువారం అర్ధరాత్రి నుంచి 9వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు ఉంది కాబట్టి నాగపంచమి పూజ శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలు పెట్టి 10:30 నిమిషాల్లోపు పూర్తి చేసుకుంటే మంచిది.

  • నాగపంచమి పూజావిధానం
    నాగపంచమి పూజ చేసేవారు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకోవాలి.
  • ముందుగా నీటిలో సముద్రపు ఉప్పు, గో మూత్రం కలిపి ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • జాతకంలో కాలసర్ప దోషం ఉంటే నాగ పంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి వాటికి పచ్చి పాలతో అభిషేకం చేసి పచ్చి పాలు, చిమ్మిలి, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం పూజించిన వెండి సర్పాలను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి.
  • శక్తిలేనివారు ఆవు పేడను కానీ, పుట్ట మన్నును కానీ సర్పాకారంలో తయారు చేసి, పచ్చి పాలతో అభిషేకించి, చిమ్మిలి, చలిమిడి నైవేద్యంగా సమర్పించి ప్రవహించే నీటిలో విడిచి పెట్టవచ్చు.
  • నాగపంచమి రోజు నాగరాజుకి సంబంధించిన 12 నామాలైన అనంత, వాసుకి, పద్మనాభ, శేష, కంబల, కర్కోటక, ధృతరాష్ట్ర, అశ్వతర, కాళీయ, శంఖపాల, పింగళ, తక్షకులను తలచుకుని పూజ చేస్తే మంచిది.

ఆలయంలో పూజలు ఇలా!
ఇంట్లో పూజ చేసుకోవడం వీలు కాని వారు తలారా స్నానం చేసి, పూర్తి ఉపవాసం ఉండి నాగ ప్రతిష్ఠలు కానీ నాగుపాము పుట్టలు ఉన్న ప్రదేశానికి కానీ వెళ్లి పుట్టలో పాలు పోసి నమస్కరించుకోవాలి. ఒకవేళ పుట్ట లేకపోతే నాగ ప్రతిష్ఠలకు పాలతో అభిషేకం చేసి కొబ్బరి కాయలు అరటిపండ్లు సమర్పించాలి. పసుపు కుంకుమలతో నాగ ప్రతిష్ఠలను పూజించాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి తలారా స్నానం చేసి ఆలయానికి వెళ్లి నాగ ప్రతిష్టలను పాలతో అభిషేకించి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.

పూజకు నియమాలు

  • నాగపంచమి పూజ చేసే వారు పూర్తి ఉపవాసం ఉండాలి.
  • ఆరోగ్య సమస్యలతో ఉపవాసం ఉండలేని వారు పచ్చి పాలు, పండ్లు తీసుకోవచ్చు.
  • ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోని వేడి చేసిన ఆహార పదార్ధాలను తీసుకోరాదు. అలాగే పండ్లు కూడా కత్తితో కోయరాదు.
  • బ్రహ్మచర్యం, భూశయనం తప్పనిసరి.

నాగపంచమి పూజాఫలం
నియమ నిష్టలతో నాగపంచమి పూజ చేస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని, పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని విశ్వాసం. నాగ పంచమి రోజున నాగదేవతను ఆరాధించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు, సంతానం కలగడంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మనం కూడా రానున్న నాగపంచమి రోజు నాగదేవతలను పూజిద్దాం. సకల శుభాలను పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details