Mohini Ekadashi 2024 : అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మధనం నుంచి ఉద్భవించిన అమృతాన్ని పొందడం కోసం దేవదానవులు యుద్ధానికి దిగిన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినిగా మారుతాడు. అత్యంత సుందరమైన మోహినిని చూసి అందరి మనసులు చలిస్తాయి. ఆ సమయంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేసి దేవతలకు అమరత్వం కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తి మోహిని అవతారం స్వీకరించిన వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం.
విష్ణుమూర్తి ఆరాధన అనంతకోటి పుణ్యం
మోహిని ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని, రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్ర వచనం.
మోహిని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి
అన్ని ఏకాదశుల మాదిరిగానే మోహిని ఏకాదశి రోజు కూడా రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ రోజంతా విష్ణుమూర్తి పూజలు, భజనలు చేస్తూ కాలక్షేపం చేయాలి. ఆరోగ్య సమస్యలు కారణంగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్వికాహారం తీసుకోవచ్చు. ఇలా ఏకాదశి ఘడియలు పూర్తి అయ్యేంతవరకు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు రాగానే శుచిగా ప్రసాదం తయారు చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి. అనంతరం నైవేద్యం, మంగళ హారతులు ఇచ్చి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి.
కోరిన కోర్కెలు తీర్చే దానాలు
మోహిని ఏకాదశి రోజు ధాన్యం, వస్త్రాలు, ఆహారపదార్ధాలు, జలం, రాగి సామాగ్రి, నిరుపేదలకు దుప్పట్లు, బ్రాహ్మణులకు పండ్లు, తేనే, స్వచ్ఛమైన నెయ్యి వంటివి దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని శాస్త్ర వచనం.