తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సోమవారం+మాస శివరాత్రి- వెరీ వెరీ స్పెషల్- ఇలా పూజిస్తే కష్టాలన్నీ దూరం! - Masa Shivaratri 2024

Masa Shivaratri September 2024 : సాధారణంగా సోమవారం శివారాధనకు విశిష్టమైనది. ఆ సోమవారం మాస శివరాత్రితో కలిసి ఉంటే అది మరీ ప్రత్యేకం. అత్యంత అరుదుగా వచ్చే సోమవారం మాస శివరాత్రి. ఈ రోజు చేసే శివారాధనకు ఎలాంటి ఫలితం ఉంటుంది? అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? శివుని పూజకు మాస శివరాత్రి ఎందుకంత ప్రత్యేకం? ఈ వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Masa Shivaratri September 2024
Masa Shivaratri September 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 4:59 PM IST

Masa Shivaratri September 2024 : ప్రతినెలా ఒక మాస శివరాత్రి వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మతిథిగా చెప్తారు. అందుకే ప్రతి నెలా పరమేశ్వర ప్రీత్యర్ధం మాస శివ రాత్రిని విశేషంగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం మాసశివరాత్రి కలిసి రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు.

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి
పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసే వాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనః కారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్ర బలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో వారి ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అమావాస్యకు ముందు ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం
కొంతమందికి అమావాస్య ముందు ఆరోగ్యం బాగోలేక పోవడం, కొన్ని రకాల మానసిక సమస్యలు ఎక్కువ కావడం, అనుకోని ప్రమాదాలు జరిగి మృత్యువాత పడటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కేతు గ్రహ దోష ప్రభావాలే. అంతేకాదు చంద్ర బలం తక్కువగా ఉన్న సమయంలో కేతు ప్రభావం పెరిగి జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

కేతు గండాలను పోగొట్టే మాస శివరాత్రి పూజ
కేతు గండాల నుంచి బయట పడటానికి శాస్త్రం మాస శివరాత్రి పూజకు ప్రాధాన్యతను ఇచ్చింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని ఆరాధించి సంపూర్ణ ఆయుష్షును పొందిన కథ మనందరికీ తెలిసిందే. అందుకే మాస శివరాత్రి రోజు శివుని నియమ నిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి గండాలైనా పోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.

మాసశివరాత్రి పూజకు శుభసమయం
సెప్టెంబర్ 30వ తేది సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపు మాసశివరాత్రి పూజకు శుభసమయం. ఉదయం ఇంట్లో యథావిధిగా రోజు చేసుకునే సమయంలో పూజ చేసుకోవచ్చు.

మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచియై ఇంట్లో పూజాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకం జరిపించి, అష్టోత్తర శత నామాలతో శివయ్యను అర్చించాలి. శివయ్యకు పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.

మాస శివరాత్రి పూజాఫలం
మాస శివరాత్రిని ఈ విధంగా శాస్త్రోక్తంగా జరుపుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. జాతకంలోని క్షీణ చంద్ర దోషముల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. రానున్న సోమవారం మాస శివరాత్రి పర్వదినం రోజు మనమందరం కూడా పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిద్దాం ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.

ముఖ్యగమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details