Mahashivaratri 2025 Fasting Rules: శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహా శివరాత్రి పర్వదినానికి గడియలు సమీపించాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ పండగ రోజున ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోమోగుతాయి. ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం, జాగరణ తప్పనిసరి. అయితే మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ నియమాలు పాటించకపోతే పూజా ఫలితం దక్కదంటున్నారు. ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలని మాచిరాజు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలంటు స్నానం చేయకూడదని, తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. చాలా మందికి తలస్నానానికి, తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే- కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే- తలకి నూనె రాసుకుని కుంకుడుకాయ లేదా షాంపూతో స్నానం చేయడం. కాబట్టి శివరాత్రికి ముందు రోజే తలంటు స్నానం చేసి పండగ రోజు తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.
- ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలని, పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు.
- శివరాత్రి రోజున చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. కానీ, శివరాత్రి రోజు ఎవరూ కూడా ఇలా ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయని అంటున్నారు. కాబట్టి కనీసం పాలు, పండ్లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు.
- చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని, 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు.
- అసౌచం ఉన్న వాళ్లు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అసౌచం అంటే జాతాసౌచం, మృతాసౌచం. అంటే బిడ్డ జన్మించినప్పుడు పురుడ ఉంటుంది, అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికీ మైలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు.
- ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. ఉపవాసం ఉండే వారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని అంటున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం 'నమః శివాయ లేదా శ్రీం శివాయ నమః' అనే మంత్రాన్ని కచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు.
మహాశివరాత్రి నాడు శివయ్యకు ఎంతో ఇష్టమైన ప్రసాదాలు - నైవేద్యంగా పెడితే ఎంతో సంతోషిస్తాడు!