Maha Shivaratri Fasting Rules :ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శివరాత్రి రానే వచ్చింది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అయితే, ఈ ఉపవాస, జాగారాలు ఎలా చేయడం వల్ల మనం పరమేశ్వరుని అనుగ్రహం ఎలా పొందుతామో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సర్వం శివమయం
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట పర్వదినాన ప్రతి శైవ క్షేత్రంలోనూ రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ పర్వదినాన రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. రాత్రంతా పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. శివునికి దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో గడిపి, రాత్రి జాగారం చేస్తారు.
శివోహం!
అయితే శివరాత్రి రోజున కేవలం ఉపవాసం, జాగారం ఉంటూ పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు మనకు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించి, ముక్తి పొందిన ఘటనలు ఉన్నాయి. గుణనిధి కథ ఇందుకు ప్రబల సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు.
ఉపవాసం అంటే?
ఉపవాసం, జాగరణ ఎలా చేస్తే మంచిదంటే రోజంతా భగవంతుని సన్నిధిలో ఆ భగవంతుని చింతన, సేవలో ఉంటూ ఉండడమే ఉపవాసం అంటారు. ఉపవాసం అన్న పదానికి అర్థం ఏమిటంటే 'ఉప', 'వసించడం' అని అర్థం. అంటే శివరాత్రి రోజు మనం ప్రతిరోజూ చేసే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి, భగవంతునికి దగ్గరగా నివసించాలి. అంతే కానీ ఉపవాసం పేరు చెప్పి ఆహారం మాని, దేవాలయాలలో వ్యర్థ ప్రసంగాలు చేస్తూ కాలం గడపడం కాదు. ఉపవాసమని చెప్పుకుంటూ ఏవేవో ఆలోచనలు చేయడం మంచిది కాదు.
ఇదే అసలైన జాగరణ
ఇక జాగరణ అన్న పదానికి అర్థం జాగరూకతతో ఉండడం అని! ఆ మహా శివుడు ఆవిర్భవించిన వేళ మనం ప్రాపంచిక విషయాలన్నీ పక్కన పెట్టి ఆ శివుని స్మరిస్తూ లింగోధ్బవ వేళ ఏకాదశ రుద్రాభిషేకాలు చేయాలి. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. 'జన్మకో శివరాత్రి' అంటారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలా ఉపవాస జాగారాలు చేసి శివుని సేవిస్తే మోక్షం లభిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.