తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శివరాత్రి రోజున ఇలా పూజ చేస్తే- సకల పాపాలు నశించి, మోక్షం కలగడం ఖాయం! - MAHA SHIVARATRI 2025

మహా శివరాత్రి రోజు తప్పకుండా వినాల్సిన గుణనిధి కథ- ఒక్కసారి వింటే ముక్తి లభించడం తథ్యం!

Maha Shivaratri 2025
Maha Shivaratri 2025 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 6:26 PM IST

Maha Shivaratri 2025 : మహా శివరాత్రి రోజు పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగారాలతో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే వీలైనన్ని ఎక్కువగా శివలీలలు తెలిపే కథలను చదువుకోవడం. శివరాత్రి మహాత్యాన్ని తెలిపే కొన్ని కథలు తెలుసుకోవడం ద్వారా మనలో నిద్రాణమై ఉన్న శివ భక్తి జాగృతం అవుతుంది. అలాంటి ఓ కథనే ఇప్పుడు తెలుసుకుందాం.

శివరాత్రి రోజు తప్పకుండా వినాల్సిన కథ
శివరాత్రి నాడు చేసే ఉపవాసం, జాగారం వలన కలిగే పుణ్యం అనంతం. ఆ మహాత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే మనం గుణనిధి కథ గురించి తెలుసుకోవాలి. పరమేశ్వరుడు ఎంత భక్త సులభుడో, శివరాత్రి ఎంత పుణ్య కారకమో గుణనిధి కథ మనకు స్పష్టం చేస్తుంది.

గుణనిధి కథ
గుణనిధి ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. కానీ బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే ఏ ఆచారాలూ గుణనిధికి పట్టవు. ఐహిక సుఖాల మోజులో సంధ్యావందనం మొదలు ఏ వైదిక కర్మలు ఆచరించేవాడు కాదు. అతనికి లేని వ్యసనం లేదు. సకల దుర్గుణాలన్నీ అలవరచుకుంటాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం చేస్తుండేవాడు. జూదం, కోడిపందాలు, పాచికలాటల్లో ఆరితేరిపోయాడు. ఓడిన ప్రతీసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కుదువ పెట్టేవాడు. ఇతని దుర్గుణాలు తెలిసి తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు.

అనుకోని ఉపవాసం
అలా అన్ని విధాలా పతనమైన గుణనిధి ఒక మహాశివరాత్రి రోజు అనివార్య పరిస్థితుల్లో గుప్పెడు మెతుకులు దొరక్క ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక బాగా పొద్దుపోయాక గుడిలో ప్రసాదమో, ఫలమో దొరుకుతుందన్న ఆశతో శివుని ఆలయానికి వెళ్తాడు. ఆ రోజు శివరాత్రి కావడం వల్ల ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తుంటాడు. అతని తలమీద ఉన్న పాత్రల్లోని వంటకాల ఘుమఘుమలు గుణనిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తినాలనుకున్నాడు గుణనిధి. భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి, తర్వాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. దీపం కొడిగట్టి చీకటిలో ప్రసాదం గిన్నె కనబడకపోతే తన ధోవతిని చింపి వత్తిగా చేసి ప్రమిదలో వేస్తాడు. ప్రసాదం గిన్నెను తీసుకొని బయటకు వస్తూంటే గుణనిధి కాలు నిద్రిస్తున్న ఒక భక్తునికి తాకుతుంది. వాడు మేల్కొని 'దొంగ దొంగ' అని అరుస్తాడు. గుణనిధి పాత్రతో సహా పరుగెత్తుతాడు. వెంట తరుముతూ వచ్చిన తలారులు గుణనిధిని చంపుతారు.

యమభటులు శివకింకరుల వాగ్వివాదం
ఈ గుణనిధిని తీసుకెళ్లడానికి యమభటులు, శివకింకరులు ఇద్దరూ వస్తారు. యమభటులు గుణనిధి పాపాలన్నీ ఏకరువు పెట్టి, వీడు కైలాసానికి వచ్చేందుకు అర్హుడు కాడంటారు. దానికి శివకింకరులు, "ఏదైనా పుణ్యకార్యం చేద్దామనుకొని చేయడం ఎంత పుణ్యమైందో- ఎంతటి పాపి అయినా అనుకోకుండా పుణ్యకార్యాన్ని చేయడమూ అంతే పుణ్యాన్నిస్తుంది. ఈశ్వర భక్తి తెలిసినట్లే ఉంటుంది. కానీ, దాని లోతు బ్రహ్మాదులకు కూడా అంతుపట్టదు. వీడు శివరాత్రి నాడు అన్నం దొరకక పస్తులున్నాడు. శివాలయంలో మేల్కొని ఉన్నాడు. దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్ని చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివ సందర్శన అన్నీ ఒకే క్రమంలో, అదీ శివరాత్రి నాడే జరగడం అతని పూర్వజన్మ ఫలితం కాక మరేమిటి? శివసాయుజ్యం పొందేందుకు ఇంత కంటే ఇంకేం కావాలి?" అని యమ భటులను ప్రశ్నిస్తారు. చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా గుణనిధి ముక్తి పొందుతాడు.

పుణ్యఫలం
జీవితమంతా పాపాలు చేసినా, మరణించే ముందు చేసిన ఒక్క శివరాత్రి ఉపవాసం, జాగారం ఫలితంగా ఈ గుణనిధి మరుసటి జన్మలో సంపదలకు అధిపతి అయిన కుబేరుడుగా జన్మిస్తాడు. అందుకే శివరాత్రి మహాత్యం అంతటిది అని చెబుతారు. భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు గుణనిధి మహా శివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసముండి, దీపం వెలిగించిన కారణంగా అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు.

ఇక, శివరాత్రి రోజున ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాల మొదలుకొని వీధి చివర ఉండే శివాలయాలు వరకు భక్త జన సందోహాలుగా మారిపోతాయి. ఈసారి మరో విశేషమేమిటంటే మహా శివరాత్రి రోజునే ఆఖరి రాజ స్నానంతో మహా కుంభమేళా పరిపూర్ణం అవుతుంది. ఇన్ని విశేషాలున్నదే ఈ ఏటి మేటి మహా శివరాత్రి.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం- త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
నిరాడంబరుడు, నిరాకారుడైన ఆ శివయ్యను శివరాత్రి రోజున చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వార్చన చేసి నమస్కరిస్తే సకల పాపాలు పోయి మోక్షం కలుగుతుంది. ఇదే మనం గుణనిధి కథ ద్వారా గ్రహించాల్సిన సారాంశం.

ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details