Magha Puranam Chapter 3 : పరమ పవిత్రమైన మాఘ మాసంలో మాఘ పురాణం శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ కథనంలో మాఘ పురాణం మూడవ అధ్యాయంలో శివపార్వతుల సంవాదం గురించి తెలుసుకుందాం.
శివపార్వతుల సంవాదం
కైలాసంలో పార్వతీదేవి పరమ శివునితో "నాథా! సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభించింది? సవివరంగా తెలియజేయండి" అని కోరగా పరమ శివుడు పార్వతితో "పార్వతీ! సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంత కాలానికి తన గురువుతో 'గురువర్యా! మీ కుమార్తె ప్రోద్భలంతోనే నేను చేయరాని పాపం చేశాను. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. నాతో కలిసి వచ్చిన గురు పుత్రిక మరణిస్తే మీరు నన్ను శపిస్తారేమో అన్న భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేయరాని పాపానికి ఒడిగట్టాను. ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పండి' అని దీనంగా వేడుకుంటున్నాడు. దీనితో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు.
సుమిత్రునికి పాపవిమోచనం చెప్పిన సుదేవుడు
సుదేవుడు సుమిత్రునితో "నీవు వెంటనే గంగానదీ తీరానికి వెళ్లి అక్కడ 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది" అని చెప్పగా, సుమిత్రుడు వెంటనే గంగా నది తీరానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి ఒక ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం ఫల పుష్పాది వృక్షాలతో, మునీశ్వరులు చేస్తున్న హోమాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అక్కడ మునీశ్వరులు తమ భార్యా బిడ్డలతోను, శిష్యులతోను కలిసి మాఘ పురాణం శ్రవణం చేయుచున్నారు. అది చూసిన సుమిత్రుడు ఆ మునులను ఉద్దేశించి 'ఓ మహానుభావులారా! మీరు చేస్తున్న వ్రతం ఎట్టిది? దాని ఫలం ఏమిటి వివరించండి' అని కోరగా ఆ మునులందరూ కలిసి సుమిత్రునికి మాఘ మాస వ్రతం వివరించమని సత్యవ్రతుడనే మునీశ్వరునికి చెప్పారు.
సత్యవ్రతుడు వివరించిన మాఘ వ్రత మహత్యం
సత్యవ్రతుడు సుమిత్రునితో "ఓ విప్రకుమారా! సావధానంగా వినుము. మేము చేయుచున్న వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం మహా పాపములను నశింపజేయును. మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా సూర్యోదయ సమయంలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారు ఆ శ్రీహరికి అత్యంత ప్రీతి పాత్రుడవుతాడు. మాఘ మాసం 30 రోజులు నది స్నానం చేసి మాఘ పురాణం ప్రతి నిత్యం వినేవారికి బ్రహ్మ హత్య పాతకములు వంటి ఘోర పాపముల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.