Life Lessons to Learn From Lord Shiva :భగవంతుడిని ఆరాధించడం అంటే.. కేవలం వరాలు కోరుకోవడమేనా? నచ్చిన కోరికలు తీర్చాలని పూజలు చేయడమేనా? అంటే.. కాదంటారు పండితులు. ఆ దేవుడు సూచించిన మార్గంలో నడవాలని సూచిస్తున్నారు. పూజలు పునస్కారాల కన్నా.. ఇదే ఆయన్ను ఎక్కువగా సంతోష పెడుతుందని చెబుతున్నారు. అందుకే.. ఈ శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు బోధించే జీవిత సూత్రాలను ఆచరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరి శివుడి నుంచి నేర్చుకోవాల్సిన ఆ పాఠాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
త్యజించడం:శివుని జీవితంలో త్యజించడం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శివుడి త్యజింపు ఒక శక్తివంతమైన భావన. ఇది మన జీవితాలను మెరుగుపరచడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది. మనిషి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి మనం బలంగా తయారవుతాం. అయితే త్యజించడం అంత సులభం కాదు. ఏదీ శాశ్వతం కాదు అనే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఈ స్థితికి చేరుకున్నవారు ఎలాంటి భౌతిక సంపదలకూ, భావోద్వేగాలకూ ప్రభావితం కాకుండా ముందుకు సాగుతారు.
కరుణ: మూడో కంటితో భస్మం చేసే కాల రుద్రుడైనప్పటికీ.. శివుడిని కరుణామయుడు అని కూడా అంటారు. కష్టాల్లో ఉన్న భక్తులను ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టే.. భోళాశంకరుడయ్యాడు. ఇదే తరహాలో.. బలహీనులను రక్షించడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని శివతత్వం బోధిస్తుంది. ఇతరుల పట్ల కరుణ చూపడం, క్షమించే గుణం అలవర్చుకోవడం అవసరమని నేర్పిస్తుంది.
సమానత్వం:శివుడు తన భక్తులందరినీ ఒకేతీరుగా ప్రేమిస్తాడు. వర్గబేధం, లింగ బేధాలేవీ చూపకుండా వారిని అంగీకరిస్తాడు. తద్వారా మానవజాతికి సమానత్వాన్ని బోధిస్తాడు. ఈ తరహాలోనే.. మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం, సమానంగా చూడడం, సహనంగా ఉండటం, అందరినీ ప్రేమించడం వంటివి శివుని నుంచి నేర్చుకోవల్సిన జీవిత పాఠాలు.
పరివర్తన:ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకోగల సామర్థ్యం శివశక్తికి ఉంది. ఈ పరివర్తన మానవులకూ అవసరం. అందుకే.. మార్పును అంగీకరించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడూ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి.