How To Reach Kurudumale Ganesha Temple :వినాయకుని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగి పోతాయని అంటారు. కొన్నేళ్లుగా అనుకున్న పనులు జరగక ఆటంకాలతో విసిగిపోయి ఉంటే 'కురుడుమలై' గణపతి ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా నిర్విఘ్నంగా జరుగుతుందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
కురుడుమలై గణపతి ఆలయం బెంగళూరు విమానాశ్రయం నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కురుదుమలె గణపతి ఆలయం వెలసి ఉంది.
త్రిమూర్తి ప్రతిష్ఠిత శక్తి గణపతి!
కురుడుమలై ఆలయంలోని గణపతి విగ్రహం ఏక సాలగ్రామ శిలపై చెక్కిన 14 అడుగుల భారీ విగ్రహం. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ఆలయ స్థల పురాణం
త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని దర్శించుకొని విఘ్నాలు తొలగించుకున్నారని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, పాండవులు కూడా కురుదుమలె గణపతిని దర్శించి సేవించినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
కృష్ణదేవరాయల ప్రాకారం
ఒకానొకప్పుడు శ్రీ కృష్ణదేవరాయలకు ఈ గణపతి స్వప్నంలో కనిపించి తన ఆలయానికి ప్రాకారం నిర్మించమని చెప్పాడట! లంబోదరుని ఆదేశం మేరకు రాయలవారు ఇక్కడ ఆలయానికి ప్రాకారం నిర్మించారని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది.
ప్రాచీన మందిరం
కురుడుమలై గణపతి ఆలయం అతి ప్రాచీనమైనదని, ఈ గుడి సుమారు 2000 ఏళ్ల కిందటిదని ఆర్కియాలజీ వారు నిర్ధరించారు. పూర్వంలో ఈ ఆలయాన్ని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా ఇదే కురుదుమలె గా మారిందని అంటారు.