తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

అక్కడ ఆదివారం మాంసాహారం తినరు, అంత్యక్రియలు నిర్వహించరు - గుడి నిర్మాణంలో అలా జరిగిందనే! - KOTTURU SUBRAMANYA SWAMY TEMPLE

విభిన్నమైన ఆచారం- రాత్రికి రాత్రే గుడి నిర్మాణం- కొత్తూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విశేషాలివే!

Kotturu Sri Valli Subramanya Swamy Temple
Kotturu Sri Valli Subramanya Swamy Temple (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2025, 4:48 AM IST

Kotturu Sri Valli Subramanya Swamy Temple :ఆదివారం అందరికి సెలవు ఉంటుంది. అందులో స్పెషల్ ఏమి ఉంది అంటారా? ఈ గ్రామంలో వారికి అన్నిటికి సెలవే! సుబ్రహ్మణ్యుని ఆరాధ్య దైవంగా భావించే ఈ గ్రామస్థులు పాటించే ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్యుని ఆలయ చరిత్ర ఉంది. ఇంతకు ఈ గ్రామం ఎక్కడుంది? ఈ గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యుని ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం
కర్నూలు జిల్లా కొత్తూరు గ్రామం మండల కేంద్రమైన పాణ్యం నుండి 20 కి. మీ. దూరం, సమీప పట్టణమైన నంద్యాల నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. కొత్తూరులోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు ఈడేర్చే ఈ స్వామి దర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు.ఇక్కడ సర్ప రూపంలో 500 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యుడు సుబ్బారాయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుంచి ఈ ఊరిపేరు సుబ్బరాయుడు కొత్తూరుగా మారిపోయింది.

విభిన్నమైన ఆచారం
పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇక మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

ఆలయ స్థలపురాణం
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. మాఘ మాసంలో షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు.

భూమి నుంచి బయటపడ్డ 12 తలల నాగుల విగ్రహాలు
ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది.

బాలుని రూపంలో సుబ్రహ్మణ్యుడు
ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని, మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు.

రాత్రికిరాత్రే గుడి నిర్మాణం
గుడి నిర్మాణం ముందు గ్రామస్థులు బాలుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి, తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

పూజోత్సవాలు
ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. మంగళవారం, ఆదివారం, ప్రతి మాసంలో వచ్చే రెండు షష్టి తిథులలో స్వామికి అభిషేకం, విశేష పూజలు జరుగుతాయి. నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి, మాఘ మాసంలో వచ్చే షష్ఠి తిథులలో ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శించి పూజిస్తే నాగసర్ప దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ABOUT THE AUTHOR

...view details