తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

అర్జునుని ధర్మ సందేహం - శ్రీ కృష్ణుని హితబోధ - అసలైన ధర్మ సూక్ష్మం ఏంటంటే? - MAHABHARATAM STORY

పోతనామాత్యుడు రచించిన భారతంలో ధర్మసూక్ష్మాలు

Mahabharatam Story
Mahabharatam Story (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 13 hours ago

Mahabharatam Story In Telugu :హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎందరో మహర్షులు ఎన్నో విలువైన గ్రంథాలను రచించి మనకు అందించారు. ప్రతి గ్రంథం సారాంశం మానవుడు సరైన దారిలో వెళ్లేలాగా ప్రోత్సహించడం, ఏది ధర్మం? ఏది అధర్మం తెలిసేలాగా చేయడం. అందుచేతనే మన పురాణాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజనీయమయ్యాయి. ఈ పురాణాలను కేవలం చదివి వదిలేయకుండా వాటి ద్వారా గ్రహించిన ఒక్క మంచి పనిని ఆచరించినా మన సమాజంలో ఎలాంటి నేరాలు, ఘోరాలు ఉండవు. సమాజంలో మానవుడు ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి ఆపదలో ఒకరు తోడుగా ఉంటే కలిగే ఫలితం గురించి తెలియజేసే ఒక చిన్న కథను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతంలో ధర్మసూక్ష్మాలు
పోతనామాత్యుడు రచించిన భారతంలోని ఓ చిన్న సంఘటన ద్వారా ఒక గొప్ప సందేశాన్ని గురించి తెలుసుకుందాం.

యాచకునికి బంగారు నాణేలు
ఒకసారి కృష్ణార్జునులు కలిసి పనిమీద వెళ్తున్నారు. వారికి మార్గమధ్యంలో పేదరికంతో యాచకునిలా మారిన ఓ పేద బ్రాహ్మణుడు కనిపించాడు. అతనిని చూసి అర్జునుడు ఎంతో దయతో అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.

బ్రాహ్మణుని దోచుకున్న దొంగ
అర్జునుడు ఇచ్చిన బంగారు నాణేలను సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ పేద బ్రాహ్మణుని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి మొత్తం దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

బ్రాహ్మణునికి ఖరీదైన వజ్రం ఇచ్చిన అర్జునుడు
ఓ రోజు అదే దారి వెంబడి వెళ్తున్న అర్జునుడు పేద బ్రాహ్మణుని చూసి ఆశ్చర్యపోయి, ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు.

మాయమైన వజ్రం
మరుసటి రోజు తెల్లారింది. బ్రాహ్మణుడు నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో భార్య లేదు. అలాగే వజ్రం దాచిపెట్టిన కుండ కూడా లేదు. బ్రాహ్మణుడు ఆందోళనతో పరుగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్లాడు. అక్కడ నీరు తెస్తున్న తన భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. అయితే కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం కుండను వంచినప్పుడు వజ్రం నీటి ప్రవాహంలోకి జారిపోయింది.

మళ్లీ యాచకునిగా మారిన బ్రాహ్మణుడు
తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు. మళ్లీ కృష్ణార్జునులు అతనికి ఎదురయ్యారు. ఏమి జరిగిందని అడిగారు. జరిగింది తెలుసుకున్నారు. అప్పుడు అర్జునుడు శ్రీ కృష్ణునితో "ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా? ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు" అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు "లేదు అర్జునా! ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం" అని అంటూ బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు.

బ్రాహ్మణుని వైరాగ్యం
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, ఖరీదైన వజ్రం అందుకుని కూడా నిలుపుకోలేక పోయిన బ్రాహ్మణుడు ఇప్పుడు వైరాగ్య స్థితికి చేరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు తనలో తానే "విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చి కానీ" అనుకుంటూ ఇంటికెళుతున్నాడు.

బ్రాహ్మణుని దయాగుణం
బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్తూ దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. జాలితో అతని హృదయం ద్రవించింది. "కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం" అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.

తిరిగిన బ్రాహ్మణుని దశ
బ్రాహ్మణుడు తెచ్చిన చేపను చూసి అతని భార్య "అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది. అందుకే గిలగిలా కొట్టుకుంటోంది" అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. అది ఒకప్పుడు నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. బ్రాహ్మణుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరై 'దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది' అని గావుకేకలు పెట్టాడు.

బ్రాహ్మణునికి పట్టిన అదృష్టం
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. అతను ఎవరో కాదు గతంలో అతన్ని దారి దోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించిన దొంగే. బ్రాహ్మణుని కేకలు విని ఆ దొంగ "నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు గుర్తు పట్టినట్టు ఉన్నాడు అందుకే కాబోలు నాది నాకు దొరికింది" అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు. వెంటనే దొంగ ఆ బ్రాహ్మణుని దగ్గరకి వచ్చి "నీకు దణ్ణం పెడతాను. నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో. నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వద్దు" అని ప్రాధేయపడ్డాడు.

పోగొట్టుకున్నవి పొందిన బ్రాహ్మణుడు
ఇప్పుడు ఆశ్చర్యపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు వాటంతట అవే తమ దగ్గరకు చేరాయి. అప్పుడు బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.

అర్జునుని ధర్మ సందేహం
ఇదంతా చుసిన అర్జునుడు ఆశ్చర్యపోయి "కృష్ణా నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవు ఇచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది" అని ప్రశ్నించాడు అర్జునుడు.

కృష్ణుని హితబోధ
అర్జునుని సందేహం విన్న కృష్ణుడు "అర్జునా! అతని వద్ద ఎక్కువగా బంగారం, ఖరీదైన వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే కేవలం రెండు బంగారు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. బ్రాహ్మణుడు కష్టంలో ఉన్న ప్రాణి బాధను తగ్గించాలనుకున్నాడు. అందుకే అర్జునా అతని బాధను నేను తగ్గించాను" అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ

ఇదే అసలైన ధర్మ సూక్ష్మం
చూసారుగా ఓ చిన్న సంఘటన ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చిందో! మానవుడు స్వార్ధాన్ని వీడి పరోపకార బుద్ధిని అలవరచుకుంటే అతని శ్రేయస్సును భగవంతుడే చూసుకుంటాడు. ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేక మానవులు స్వార్ధంతో ధనం మీద అత్యాశతో బంధువులను, స్నేహితులను దూరం చేసుకుంటున్నారు. నిత్యమూ, శాశ్వతమైన పరమాత్మ సహచర్యాన్ని కోల్పోయాడు.

స్వార్ధమే అనర్ధ కారణం
ఒక తెలుగు కవి చెప్పినట్లుగా "స్వార్ధమే అనర్ధ కారణం అది తెంచుకొనుటే క్షేమదాయకం" మనం కూడా స్వార్ధాన్ని వీడుదాం ఆపదలో ఉన్నవారికి సహాయం చేద్దాం. మన ఆపదలను ఆ పరమాత్మే తొలగిస్తాడు. నమో భగవతే వాసుదేవాయ నమః! సర్వే జనాః సుఖినోభవతుః.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ABOUT THE AUTHOR

...view details