Janmashtami 2024 Pooja Rituals : హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో ఒకటి.. శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. అయితే, పురాణాల ప్రకారం.. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి, ఈ ఏడాది ఆగష్టు 26న తేదీన కన్నయ్యను పూజించుకోవాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని ఏవిధమైన పూలతో పూజించి.. ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయో కూడా వివరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోకులాష్టమి రోజు భక్తులు వారి ఇళ్లను అలంకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి.. సాయంకాలం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అయితే, జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. తులసీదళాలంటే నల్లనయ్యకు మహాప్రీతి. కాబట్టి జన్మాష్టమి(Janmashtami 2024)నాడు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధించినా ఆయన సంపూర్ణ మైన అనుగ్రహం లభిస్తుందంటున్నారు.
సుందరం సుమధురం శ్రీకృష్ణ జననం
ఈ నైవేద్యాలు సమర్పించండి :ఇకపోతే శ్రీకృష్ణాష్టమి నాడు శ్రావణ మాసంలో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, జున్ను, మీగడ, రుచికరమైన వంటకాల్లో ఏదైనా ప్రిపేర్ చేసి నల్లనయ్యకు నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంటున్నారు. అంతేకాదు.. శ్రీకృష్ణాష్టమి నాడు నల్లనయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
- అందులో భాగంగా గోకులాష్టమి రోజు కన్నయ్యను జాజిపూలతో పూజించినట్లయితే.. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
- సంపగి పూలతో పూజిస్తే.. శత్రు బాధలన్నీ తొలగిపోతాయట. అంటే.. శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చంటున్నారు.
- పారిజాత పూలతో ఆరాధిస్తే.. జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్ప దోషాలను తొలగించుకోవచ్చట.
- పద్మ పుష్పాలతో కన్నయ్యను పూజిస్తే.. అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- మల్లెపూలతో ఆరాధిస్తే.. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయంటున్నారు.
- గన్నేరు పుష్పాలతో పూజిస్తే.. కవిత్వం, వాక్చాతుర్యం పెరుగుతుందని చెబుతున్నారు.
- తుమ్మి పూలతో జన్మాష్టమి రోజు కృష్ణుడిని ఆరాధిస్తే.. ఆయన పట్ల భక్తి మరింత పెరుగుతుందంటున్నారు.
- నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే.. సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు.
- తెల్ల జిల్లేడు పూలతో ఆరాధిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందట.
- పొద్దు తిరుగుడు పుష్పాలతో పూజిస్తే.. . అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయంటున్నారు.
- ఇలా గోకులాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని ఒక్కొక్క పూలతో పూజిస్తే ఒక్కొక రకమైన విశేషమైన ప్రయోజనం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్.
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ? ఆగస్టు 26నా లేదా 27వ తేదీనా? - పండితుల సమాధానమిదే!