Kotappakonda Temple History :కాకులు దూరని కారడవి అనే పదం మనందరికీ పరిచయమైనదే. కానీ కాకులు వాలని కొండ ఎప్పుడైనా విన్నారా? అలాంటి కొండ నిజంగా ఉందా? అవును ఉంది. ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ ఈ కొండపై మాత్రం కాకులు వాలవు. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణమేమిటి? అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.
కోటప్పకొండ
కోటప్ప కొండగా ప్రఖ్యాతి చెందిన త్రికూటాద్రి " శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉంది. ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడి స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకొచ్చిందో తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
త్రిమూర్తి శిఖరం త్రికూటాద్రి
కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని "త్రికుటాద్రి అని పిలుస్తారు.
ఆలయ స్థల పురాణం
దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా, కోటప్పకొండ శివుని ఆకర్షించి, ఆశ్రయమిచ్చింది. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం.
గొల్లభామ భక్తి
ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా 'ఆనంద వల్లి' అనే గొల్లభామ ప్రతిరోజూ పాలు, తేనెలతో శివుని సేవిస్తూ ఉండేది. అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటం వల్ల అతనికి బాలయోగిలా, దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.
కాకులకు ఇందుకే శాపం
ఒకసారి గొల్లభామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్లభామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందంట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తధాస్తు అన్నాడంట. అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు వాలవు.
శివుని ఆతిధ్యానికి పిలిచిన శాలంకయ్య
ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే తాను వస్తానని, శాలంకయ్యను ఇంటికి వెళ్లమని అంటాడు. మరోవైపు గొల్లభామ ఆనందవల్లి గర్భవతై 'కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా' అని శివుడిని వేడుకుందంట. శివుడు ఆమె మొర విని గొల్లభామతో "నేను క్రిందకు దిగి వచ్చే వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా, సరే అంటూ ఆ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు.
శివుని అడుగుల ధాటికి పగిలిన కొండలు
శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి. ఆ శబ్దాలు విన్న గొల్లభామ ఏమి జరిగిందో చూడాలన్న ఆత్రుతతో, శివునికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనుకకు తిరిగి చూసింది. ఆమె చూడగానే పరమ శివుడు అక్కడికక్కడే లింగ రూపంగా మారాడు. ఆ గొల్లభామ కూడా అక్కడే శిలగా మారిపోయింది.