Kojagara Purnima 2024 Pooja Vidhanam Telugu: హిందూ పురాణాల్లో పూర్ణిమకు ఎంతో విశిష్టత ఉంది. అయితే.. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రత్యేకత ఉంది. కోజాగరి పూర్ణిమగా పిలుచుకునే ఈ పవిత్రమైన రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని, భక్తులందరినీ అనుగ్రహించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ సంవత్సరం "కోజాగరి పూర్ణిమ" ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి? ఆ రోజు పూజ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దేశంలోని చాలా ప్రదేశాల్లో ఆశ్వయుజ మాసంలో వచ్చే కోజాగరి పూర్ణిమను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీ పూజ చేయడానికి ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు. ఇక ఈ సంవత్సరం కోజాగిరి పూర్ణిమ అక్టోబరు 16, 2024 బుధవారం రాత్రి సమయంలో వస్తోంది. అంటే.. ఆరోజు రాత్రి పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి.. బుధవారం రాత్రి ఈ ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
విశిష్టత: లక్ష్మీనారాయణులు భూలోక సంచారానికి వచ్చే ఈ పౌర్ణమి నాడు, రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్ధం వినిపిస్తూ ఉంటుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా తిష్ఠ వేసుకొని కూర్చుంటుందని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయని మాచిరాజు వివరిస్తున్నారు. "కోజాగరి పూర్ణిమ" అర్థం ఏమిటంటే.. నిద్ర మేల్కొని ఉండాల్సిన పూర్ణిమ. కాబట్టి, ఈ పవిత్రమైన రోజున(అక్టోబరు 16) అందరూ నిద్ర మేల్కొని.. రాత్రిపూట లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని పసుపు రంగు గవ్వలను తీసుకొని.. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య వీలైనప్పుడల్లా ఇంట్లో గవ్వల శబ్ధం చేస్తుండాలి. అలా చేస్తే.. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చంటున్నారు. అదే విధంగా.."కోజాగరి పూర్ణిమ" రోజునే "కౌముది లక్ష్మీ వ్రతం" అని కూడా పిలుస్తారు. ఈ రోజున ప్రత్యేకమైన లక్ష్మీ పూజ నిర్వహిస్తే సంవత్సరమంతా ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. అంతేకాదు.. లక్ష్మీ కటాక్షం వల్ల తిరుగులేని రాజవైభవం కలుగుతుందని వివరిస్తున్నారు.
కోజాగరి పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేసే ప్రత్యేక పూజ :
- కోజాగరి పూర్ణిమ రోజు రాత్రి సమయంలో మీ పూజా మందిరంలో కుడి చేతితో బంగారు నాణేలు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని గంధం, కుంకుమ బొట్లతో అలకరించుకోవాలి.
- అలాగే లక్ష్మీదేవి ఫొటో వద్ద పసుపు లేదా తెలుపు వస్త్రంలో కొన్ని పసుపు రంగు గవ్వలు ఉంచి.. వాటిని కూడా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఆపై వెండి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. వెండి ప్రమిద లేని వారు మట్టి ప్రమిదలో కూడా వెలిగించవచ్చు.
- ఆ తర్వాత సువాసన కలిగిన గులాబీ పూలతో లక్ష్మీదేవిని, గవ్వలను పూజించాలి. అనంతరం ఆవుపాలతో చేసిన నైవేద్యం, బెల్లం ముక్కను లక్ష్మీదేవి, గవ్వలకు సమర్పించాలి. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇవ్వాలి.
- అలా సమర్పించాక ఆ పాయసాన్ని ఆరుబయట వెన్నెలలో 15 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రసాదాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కారం చేసుకొని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి.
- ఆ తర్వాత ఆ గవ్వలను మూట కట్టి ధనం ఉంచే బీరువాలో దాచిపెట్టాలి. అలా ఆ మూటను బీరువాలో పెట్టిన తర్వాత వాటిలో కొన్ని గవ్వలను ఇంటి సభ్యులు తీసుకుని.. వాటిని ఊపుతూ శబ్ధం చేస్తూ ఉండిపోవాలి. అలా గవ్వలు ఊపుతున్నప్పుడు "ఓం నమో ధనదాయై స్వాహః"అనే మంత్రాన్ని ఇంటి యజమాని పఠించాలి. మిగిలిన వారు "ఓం శ్రీం శ్రీయై నమః" అనుకుంటూ ఉండాలి.
- ఇలా రాత్రిపూట గవ్వల శబ్ధం చేస్తూ.. భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి సులువుగా పాత్రులై.. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
NOTE:పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సకల మనోభీష్టాలను నెరవేర్చే 'భౌమ ప్రదోష' వ్రతం- ఎలా చేసుకోవాలంటే?
కోరిన కోర్కెలు తీర్చే పద్మనాభ ద్వాదశి వ్రతకథ- చదివినా/విన్నా సమస్త కష్టాలు తొలగిపోతాయ్!