Naraka Chaturdashi 2024: ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలో అత్యంత ప్రధానమైనది నరక చతుర్దశి. అయితే ఈ ఏడాది నరక చతుర్దశి విషయంలో తిథి ద్వయం వచ్చినందున కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. ఈ సందర్భంగా అసలు నరక చతుర్దశి ఎప్పుడు జరుపుకోవాలి? పంచాంగకర్తలు ఏమంటున్నారు? తదితర విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నరక చతుర్దశి ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ 30న మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా పండుగలు సూర్యోదయం తిథి ఆధారంగా జరుపుకుంటారు. నరక చతుర్దశిని అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
నరక చతుర్దశి పూజకు శుభసమయం
నరక చతుర్దశి రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, తర్వాత 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పూజకు శుభసమయం.
పూజా విధానం
నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు రంగ వల్లికలు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఈ పర్వదినాన ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుందని విశ్వాసం. ఇంట్లో ఇష్ట దేవతల పూజ యధావిధిగా చేసుకోవాలి. దేవునికి సంప్రదాయ నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం నరకుని పీడ విరగడైనందుకు బాణాసంచా కాల్చుకోవాలి. రకరకాల పిండి వంటలు తయారు చేసి బంధు మిత్రులతో కలిసి భోజనం చేయాలి.
యమ దీపం అంటే ఏమిటి? ఎలా పెట్టాలి?
నరక చతుర్దశి రోజున పెట్టే యమ దీపం వలన యమ లోకంలో ఉన్న పెద్దలకు నరకం నుంచి విముక్తి కలిగి స్వర్గానికి చేరుకుంటారని విశ్వాసం. పూర్వీకులకు నరకం నుంచి స్వర్గానికి వెళ్లే దారి చూపించడం కోసమే ఈ యమ దీపం పెట్టాలని శాస్త్రవచనం. యమ లోకంలో మొత్తం 84 లక్షల నరకాలుంటాయని, వాటి నుంచి విముక్తి పొందేందుకు ఈ దీపారాధన ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.