Karthika Puranam Chapter 6 : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో కార్తిక పురాణం విన్నా, చదివినా కలిగే ఫలితాలు అనంతం. ఈ మాసంలో ప్రతిరోజూ ఒక అధ్యాయం చొప్పున కార్తిక పురాణాన్ని నిత్య పారాయణ చేసుకోవాలి. ఈ కథనంలో కార్తిక పురాణం ఆరవ అధ్యాయంలో దీపదానం మహత్యం గురించి తెలుసుకుందాం.
దీపదాన మహాత్యాన్ని వివరించిన వశిష్ఠుడు
వశిష్ఠుడు జనకునితో 'ఓ రాజశ్రేష్టుడా! ఎవరైతే కార్తిక మాసంలో నెలరోజులపాటు శివాలయంలో గాని, వైష్ణవాలయంలో గాని, వరి పిండితో గాని, గోధుమపిండితో గాని ప్రమిదను తయారు చేసి, అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి, కార్తిక మాసం చివరలో వెండితో ప్రమిదను తయారు చేసి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి సకల ఐశ్వర్యములు కలుగును. దీప దానమునకు అంతటి గొప్ప మహత్యం కలదు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు చెబుతాను వినుము" అని చెప్పసాగెను.
పిసినారి స్త్రీ కథ
పూర్వకాలమున ద్రావిడ దేశమున ఒకానొక గ్రామమునందు ఒక స్త్రీ కలదు. ఆమెకు వివాహం అయిన కొద్ది రోజులకే భర్త మరణించెను. ఆమెకు సంతానం గాని, ఎటువంటి బంధువులు గానీ లేరు. అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేస్తూ, అక్కడే భుజిస్తూ ఉండేది. ఒకవేళ ఎవరైనా ఆమె మీద ప్రేమతో ఇచ్చినా, ఆ వస్తువులను ఇతరులకు అమ్మి వేసి ఆ ధనమును వడ్డీలకు త్రిప్పుతూ మరి కొంత ధనమును కూడబెట్టింది.
ధనార్జనే ధ్యేయంగా!
ఈ విధముగా ఆమెకు ధనార్జనే తప్ప, ఒక్క నాడు కూడా దైవ పూజ కాని, దీపారాధన కాని, ఉపవాసం కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు, ఉపవాసములు, తీర్థయాత్రలు చేసే వారిని హేళన చేస్తూ ఉండేది. ఎవరికీ పిడికెడు బియ్యం కూడా పెట్టి ఎరగదు. తినీతినక ధనము కూడబెట్టడం ఒక్కటే ధ్యేయంగా జీవిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక బ్రాహ్మణుడు శ్రీరంగనాయకులను కొలవడానికి శ్రీరంగానికి వెళుతూ మార్గ మధ్యములో ఆ స్త్రీ ఉన్న గ్రామములో ఒక సత్రము నందు మజిలీ చేసెను.
పిసినారి స్త్రీకి బ్రాహ్మణుని హితబోధ
ఆ బ్రాహ్మణుడు ఆ గ్రామములోని అందరి వివరాలను గురించి తెలుసుకొని, ఆ స్త్రీ పిసినారితనం గురించి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్లి "అమ్మా! నీకు కోపం వచ్చిన సరే, నా హితవాక్యములు వినుము. మన శరీరములు శాశ్వతములు కావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములోనైనా మృత్యువు మనలను కబళించవచ్చు. పంచభూతములు, సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములో ప్రాణం, జీవము పోగానే చర్మం, మాంసం కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరం నిత్యమని నీవు భ్రమలో ఉన్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. మానవుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి కొట్టుకుంటున్నాడు. కావున ఇప్పటికైనా నా మాటను ఆలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక కూడబెట్టిన ధనమును పేదలకు, దానధర్మములకు వినియోగించి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని సేవించి మోక్షము పొందుము. నీ పాప పరిహారమునకు రానున్న కార్తిక మాసములో ప్రాతః కాలమున నదీ స్నానము చేసి, దానధర్మములు చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టి, దీపదానం చేసినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు" అని ఉపదేశించెను.
దీపదానం చేసి మోక్షం పొందిన పిసినారి స్త్రీ
అంతట ఆ స్త్రీ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని, ఆనాటి నుంచి దానధర్మములు చేయుటయేగాక, కార్తిక మాస వ్రతమాచరించి, దీపదానం చేసి జన్మరాహిత్యమును పొంది మోక్షమును పొందెను. కావున కార్తిక మాసంలో చేసే దీప దానానికి అంతటి మహత్యము కలదు" అని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు.
ఇతి స్మాందపురాణ కార్తిక మహాత్మ్యే షష్ఠాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.