Karthika Puranam Chapter 5 :కార్తిక మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ మాసంలో శివకేశవుల పూజతో పాటు కార్తిక పురాణం చదివినా, విన్నా ఆ పుణ్యం వెల కట్టలేనిది. కార్తిక పురాణంలోని 5వ అధ్యాయంలో ఉన్న కథలో భాగంగా కార్తీక పురాణం శ్రవణ మహత్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వశిష్ఠ జనకుల సంవాదం
వశిష్ఠుడు జనకునితో కార్తిక మాసంలో పురాణ శ్రవణ మహాత్యమును గురించి వివరిస్తూ "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ భగవద్గీత పారాయణం చేయవలెను. అటు తర్వాత మంచి ఉసిరి కాయలు గల చెట్లు గల వనములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి పూజించి, అటు పిమ్మట ఆ చెట్టు కిందనే బ్రాహ్మణులకు యధాశక్తి భోజనం పెట్టి, తాము కూడా అక్కడే భోజనం చేసి, పిదప కార్తిక పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేయవలెను. అట్లు చేసినచో ఉత్తమ గతులు కల్గును. ఈ విధంగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జన్మను పోగొట్టుకుని ఉత్తమ జన్మను పొందెను. ఆ కథను చెబుతాను వినుము" అని చెప్పసాగెను.
శివశర్మ కథ
పూర్వం కావేరి నదీ తీరంలో ఒక చిన్న గ్రామము కలదు. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అను పుత్రుడు కలదు. శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతి గారాబముతో పెరుగుట వలన చెడు సావాసాలు చేసి దురాచార పరుడై మెలుగు చుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి పిలిచి "కుమారా! నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకొనుచున్నారు. నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గు పడుచున్నాను. దీనికి ఒకటే మార్గం. రానున్న కార్తిక మాసంలో నీవు ప్రతి రోజు నదిలో స్నానం చేసి, శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ పోయి, నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును" అని హితవు పలికాడు.
కార్తిక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ
తండ్రి హితోక్తులు నచ్చని శివశర్మ కార్తిక స్నానమును, శివపూజను, దీపారాధనను, కార్తిక పురాణ శ్రవణమును చులకన చేసి మాట్లాడెను. కుమారుని ప్రవర్తనకి ఆగ్రహంతో దేవశర్మ "ఓరీ! నీచుడా! కార్తిక ఫలమును చులకన చేసి మాట్లాడుతున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో మూషికమై పడి ఉండు" అని శపించాడు. అంతట జ్ఞానోదయమైన శివశర్మ "ఓ తండ్రీ నన్ను క్షమింపుము. నాకు ఈ శాపం నుంచి విముక్తికి తరుణోపాయం చెప్పుము" అని తండ్రిని ప్రార్థించగా అప్పుడు దేవశర్మ "కుమారా! నా శాపమును అనుభవించుచూ, నీవు ఎప్పుడు కార్తిక మహత్యమును గురించి వింటావో అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది" అని తరుణోపాయం చెప్పాడు.
మూషిక రూపంలో చెట్టు తొర్రలో శివశర్మ నివాసం
ఆనాటి నుంచి శివశర్మ మూషికమై అడవిలో రావి చెట్టు తొర్రలో పడి ఉండేవాడు. ఆ అడవి కావేరి నది సమీపమునకు ఉండేది. ఎంతోమంది బాటసారులు, భక్తులు అక్కడకు వచ్చి, కావేరి నది స్నానమాచారించి, రావిచెట్టు కింద కూర్చుని పురాణం కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది.