తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శౌనకాది మునుల సందేహాలకు సూత మహాముని సమాధానం- కార్తిక పురాణ 30వ అధ్యాయం ఇదే!

సకల పాపహరణం కార్తిక పురాణ శ్రవణం- 30వ అధ్యాయం ఇదే!

Karthika Puranam
Karthika Puranam (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Karthika Puranam 30th Day In Telugu :పరమ పావనమైన కార్తిక మాసంలో ప్రతి ఒక్కరు తప్పకుండా చదువుకోవాల్సిన కార్తిక పురాణం చివరి రోజుకు చేరుకున్నాం. పరమేశ్వరుని కృపా కటాక్షాలతో ఎలాంటి ఆటంకం లేకుండా ముప్పై రోజుల పాటు కొనసాగిన కార్తిక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తిక మాస వ్రత మహిమ కార్తిక పురాణం పఠన ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం.

శౌనకాది మునుల సందేహాలకు సూత మహాముని సమాధానం
నైమిశారణ్య ఆశ్రమమున శౌనకాది మహా మునులందరూ సూతమహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి, వేనోళ్ల పొగడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయము తీరక సూతుని చూసి "ఓ మునిశ్రేష్టుడా! కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాశాపరులై జీవించుచు సంసార సాగరం నందు తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయము ఏదైనా కలదా? ధర్మం లన్నింటిని లోకెల్లా ఉత్తమమైన ధర్మము ఏది? దేవతలందరిలో ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభముగా మోక్షము పొందే ఉపాయము ఏది? మా ఈ సందేహములను తీర్చవలసినదిగా ప్రార్ధిస్తున్నాము" అని వేడుకున్నారు.

సూత ఉవాచ
అప్పుడు సూతుడు శౌనకాది మహామునులు చూసి "ఓ మునులారా! మీకు కలిగిన సందేహములు అందరూ తెలుసుకోదగినవి. కలియుగమునందు మానవులు మంద బుద్ధులై, క్షణిక సుఖముతో కూడిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తిక వ్రతం చేయడం వలన యజ్ఞయాగాది క్రతువులు చేసిన పుణ్యము, దానధర్మ ఫలము కలుగును. కార్తిక వ్రతం శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటే గొప్పదని సాక్షాత్తూ ఆ శ్రీహరియే వర్ణించియున్నాడు. కార్తిక వ్రత మహాత్యమును వర్ణించుటకు నాకు శక్తి చాలదు. నాకే కాదు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను నా శక్తి మేరకు ఈ వ్రత మహాత్యమును వివరించడానికి ప్రయత్నిస్తాను.

కార్తిక మాసంలో పాటించాల్సిన విధి విధానాలు
కార్తిక మాసంలో ఆచరించవలసిన పద్దతులను చెబుతున్నాను శ్రద్దగా ఆలకింపుము. "కార్తిక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి. తన శక్తి కొలది దీపదానం చేయాలి. ఈ నెలరోజులు శుచియైన భోజనం తినవలెను. అపరిశుభ్రమైన, స్నానం చేయకుండా వండిన పదార్థాలు తినకూడదు. రాత్రిపూట శివాలయంలో గాని, వైష్ణవాలయం గాని ఆవు నేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేసినచో సకల పాపముల నుంచి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు. కార్తిక వ్రతమును చేయుటకు శక్తి ఉండి కూడా చేయని వారు, ఇతరులు చేస్తుంటే ఎగతాళి చేసేవారు, వ్రతం చేసే వారికి ధన సహాయము దొరకకుండా అడ్డు తగిలేవారు కూడా ఇహ లోకములో అనేక కష్టములను పొంది అంత్యమున నరకమున యమకింకరుల చేత నానా హింసల పాలవుతారు. అంతేకాక అట్టి మానవులు నూరు జన్మలవరకు ఛండాలులుగా జన్మిస్తారు.

కార్తిక మాసంలో కావేరినది లోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానము చేసి, నిష్ఠతో వ్రతం చేసేవారు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తిక మాసం ఉత్తమోత్తమమైనది. ఎంతో ఫలదాయక మైనది. అంతేకాక హరిహరాదులకు ప్రీతికరమైనది. పుణ్యాత్ములకు మాత్రమే కార్తిక వ్రతం చేయాలనే కోరిక కలుగుతుంది. దుర్మార్గులకు కార్తిక మాసమన్నా, కార్తిక వ్రతమన్నా అసహ్యము కలుగుతుంది.

కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్య కాలమును వృధా చేయక తమ శక్తికొలది కార్తిక వ్రతమును ఆచరించాలి. మొత్తము నెలరోజులు చేయలేని వారు కార్తిక శుద్ధ పొర్ణమి రోజునైనా వ్రతమును చేసి పురాణం శ్రవణము చేసి, రాత్రంతా జాగరణ చేసి, మరునాడు ఒక బ్రాహ్మణుని భోజనానికి పిలిచి అతనిని దక్షిణ తాంబూలాలతో సత్కరించిన యెడల కార్తిక మాసం మొత్తము వ్రతం చేసిన ఫలితము కలుగుతుంది.

ఈ దానాలు శ్రేష్టం
కార్తిక మాసంలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము కలుగుతుంది. ఈ నెలరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను , మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేయుచు, పుణ్యతీర్థములు, నదులలో స్నానము చేసి, దానాలు చేస్తూ పురాణాలు వింటూ, చదువుచూ ఉన్నట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగును. ఈ కథను చదివిన వారికి విన్నవారికి ఆ శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగ చేయును". ఈ విధంగా సూత మహాముని శౌనకాది మునుల సందేహములను తీరుస్తూ మనకు కూడా కార్తీక వ్రత మహిమను గురించి తెలియజేసెను.

ఈ రోజుతో కార్తిక పురాణం ముప్పై రోజుల పారాయణం సమాప్తము అయింది.

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు

ఓం సర్వేషాం శాంతిర్భవతు

ఓం సర్వేషాం పూర్ణంభవతు

ఓం శాంతి శాంతి శాంతిః

రేపటి రోజున పోలి పాడ్యమి. కావున పోలి పాడ్యమి రోజున పోలి బొందితో స్వర్గానికి వెళ్లే కథను తెలుసుకోవడం ద్వారా కార్తిక పురాణ శ్రవణ ఫలాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఇతి స్కాంద పురాణే! కార్తీకమహాత్మ్యే! త్రింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details