Karthika Puranam 23rd Day In Telugu: పరమ పావనమైన కార్తిక పురాణ పఠనంలో భాగంగా పురంజయుని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జనకునితో వశిష్టుల వారు ఎలా వివరించారో ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదం
అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి ఇంకను వశిష్ఠులవారు ఈ విధముగా చెబుతూ ఇరవైమూడవ రోజు కథను ప్రారంభించాడు. అగస్త్యుడు అత్రిమహర్షితో"ఓ ముని పుంగవా! విజయాన్ని సాధించిన పురంజయుడు ఏమి చేసాడో వివరింపుము అని అడుగగా, అత్రిమహర్షి ఇలా చెప్పసాగాడు.
పురంజయునికి అశరీరవాణి సూచన
"ఓ మహానుభావా! పురంజయుడు కార్తిక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్ని శేషం, శత్రు శేషం ఉండరాదని తెలిసి తన శత్రువుల నందరిని జయించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుకొనుచుండెను. తన విష్ణు భక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు, తేజోవంతుడై ఉండెను. శత్రువులకు సింహస్వప్నం యుండెను. పురంజయుడు ఇప్పుడు అసమాన విష్ణుభక్తి పరాయణుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక, ఇంకా ఏయే క్షేత్రములలో శ్రీహరిని పూజించిన మోక్షము కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి "ఓ పురంజయా! కావేరి నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు. ఆ క్షేత్రమును రెండవ వైకుంఠముగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్లి శ్రీరంగనాధస్వామిని పూజించి, అర్చించిన యెడల నీకు ఈ సంసార బంధముల నుంచి ముక్తి కలిగి మోక్షమును పొందుతావు". అని పలికెను.
పురంజయుని శ్రీరంగం యాత్ర
అశరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, పుణ్య నదులలో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరి నదీ తీరమున గల శ్రీరంగనాధుని దర్శించి "ఓ దామోదరా! గోవిందా! గోపాలా! అనంతా! అచ్యుతా! హృషీకేశా! దాసోహం,పరమాత్మా దాసోహం"అని పరిపరి విధములుగా విష్ణు స్తోత్రము చేసి కార్తిక మాసమంతా శ్రీరంగం నందు గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరమునకు చేరుకున్నాడు.