Karthika Masam Fasting Significance :హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని ముఖ్య తిథుల్లో పర్వదినాల్లో ఉపవాసాలు జాగారాలు చేయడం ఆనవాయితీ. అయితే మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్న కార్తీక మాసంలో చేసే ఉపవాసం అత్యంత ఫలవంతమైనదని శాస్త్ర వచనం. ఈ కథనంలో అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం ఎలా చేయాలి? కార్తీకమాస ఉపవాస ఫలితం ఎంత గొప్పదో తెలుసుకుందాం.
కార్తీక ఉపవాసం
కార్తీక మాసమంతా ఒంటిపూట భోజనం చేసే వారుంటారు, సోమవారాలు, కార్తీక పౌర్ణమికి మాత్రం ఉపవాసం చేసే వారుంటారు, ఏకాదశి తిథులలో ఉపవాసం చేసే వారుంటారు. ఏది ఏమైనా ఉపవాసం భక్తుని భగవంతుని దగ్గరగా తీసుకెళ్తుంది. అందుకే ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది.
ఉపవాసం అంటే ఏమిటి?
ఉపవాసం అంటే 'ఉప' అంటే భగవంతునికి దగ్గరగా 'వాసం' అంటే వసించడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్ధం. ఉపవాసం అంటే మనం ప్రతినిత్యం చేసే పనులను యధావిధిగా చేసుకుంటూనే మనసును మాత్రం దైవం పట్ల లగ్నం చేయడాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు మనసుని, ఇంద్రియాలను నిగ్రహించడమే సరైన ఉపవాసం.
కార్తీక సోమవారం పూజావిధానం
కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శివలింగాన్ని కానీ శివపార్వతుల చిత్రపటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో చిన్నపాటి శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకించుకోవాలి. తుమ్మిపూలు, మారేడు దళాలతో శివాష్టోత్తరం చదువుతూ పూజించాలి. అనంతరం పండ్లు, కొబ్బరికాయ శివునికి నైవేద్యంగా సమర్పించాలి.
ఉపవాసం ఎలా చేయాలి?
ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. పండ్లు, పాలు, పళ్లరసాలు వంటివి తీసుకోవచ్చు.
సాయంకాలం పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి యధావిధిగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఇంటి గుమ్మలో దీపాలు వెలిగించాలి. సమీపంలోని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకొని వీలయితే శివాలయంలో కూడా దీపం పెట్టాలి. తరువాత నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా కార్తీకమాసంలో అన్ని సోమవారాలు ఉపవాసం చేయవచ్చు.
ఉపవాసఫలం
కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది.
ఉపవాసం వెనుక శాస్త్రీయత
మన పెద్దలు పూజలు వ్రతాలు పేరుతో ఏర్పాటు చేసిన నియమాల వెనుక శాస్త్రీయత తప్పకుండా ఉంటుంది. ఉపవాసం అనేది భగవంతుడి కోసమే అనుకుంటే పొరపాటే! ఉపవాసం ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం. అది ఎలాగో చూద్దాం.
జీర్ణవ్యవస్థకు వారానికోసారి సెలవు
ఆయుర్వేదం ప్రకారం మంచి ఆరోగ్యం సొంతం కావాలంటే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని తెలుస్తోంది. మనం నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు జీర్ణవ్యవస్థ చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే మగతగా అనిపించడానికి కారణం కూడా ఇదే. వారానికి ఓరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకుని శరీరం మూలమూలన ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.
లంఖణం పరమౌషధం!
ఇది మన పెద్దలు తరచుగా చెప్పే మాట! ఏ అనారోగ్యం వచ్చినా, జ్వరం వచ్చినా లంఖణం పరమౌషధం అని పెద్దలు చెబుతారు. అంటే ఒకపూట భోజనం మానేస్తే ఎలాంటి రుగ్మతలైనా దారికి వస్తాయని పెద్దల అభిప్రాయం.
ఉపవాసం మానసిక ఔషధం కూడా!
ఉపవాసం ద్వారా శరీరానికి స్వస్థత మాత్రమే కాదు మనసుకి కూడా ప్రశాంతత కలుగుతుంది. మనం తినే ఆహరం ప్రభావం మన మనసుపై ఖచ్చితంగా ఉంటుంది. సాత్వికమైన ఆహరం తింటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి. అందుకే ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు ఉప్పు కారాలు లేని, కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకునే వారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు భగవన్నామస్మరణ తప్ప మరో ఆలోచన రాదు. మానసిక ప్రశాంతతకు, ఇంద్రియ నిగ్రహానికి ఉపవాసాన్ని మించిన మందులేదు.
ఇందుకే కార్తీక ఉపవాసం
అందుకే కార్తీకమాసం మొత్తం నిత్యం ఒకపూట తినేవారు కొందరు, ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరు, ఏకాదశి-ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు . ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క సోమవారమైనా ఉపవాసం ఉండాలని చెబుతారు.
కార్తీకంలోనే ఉపవాసం ఎందుకు?
కార్తీకమాసంలోనే ఉపవాసాలు చేయమని ఎందుకన్నారంటే కార్తీకమాసంలో ఉష్ణోగ్రతలు , చలి రెండూ సమానంగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే శరీరంలో సమతుల్యత వృద్ధి చెంది రోగాల బారిన పడకుండా ఉపవాసదీక్షలు మేలు చేస్తాయి. ఈ కార్తీకంలో ఉపవాసాలు చేద్దాం. భగవంతునికి దగ్గరగా నివసించుదాం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.