Karthika Mahapuranam Chapter 13 : పవిత్ర కార్తిక మాసంలో చేసే కార్తిక పురాణం శ్రవణం ద్వారా ఎన్నో విలువైన సంగతులను తెలుసుకుంటున్నాం. ఈ కథనంలో కార్తిక మాసంలో కన్యాదాన ఫలం ఎంత గొప్పదో జనకునికి వశిష్ఠులవారు వివరించిన వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం.
కార్తిక పురాణం-పదమూడవ రోజు
వశిష్ఠుడు జనకునితో పదమూడవ రోజు కథను ప్రారంభిస్తూ "ఓ జనక చక్రవర్తీ! కార్తిక మాసంలో విధిగా చేయవలసిన ధర్మములు ఇంకా ఉన్నాయి. వాటి గురించి చెబుతాను, శ్రద్దగా వినుము" అని చెప్పసాగెను. 'కార్తిక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనము చేయుటకు అయ్యే ఖర్చు భరించి ఉపనయనం చేయుట ముఖ్యం. దానికంటే ఒక సలక్షణమైన కన్యను కన్యాదానం చేయుట ఇంకా గొప్పది. ఎవరైతే కార్తిక మాసంలో భక్తిశ్రద్దలతో కన్యాదానం చేస్తారో అట్టివారు తాము తరించుటయేగాక, తన పితృ దేవతలను కూడా తరింప చేసిన వారు అవుతారు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. చెబుతాను శ్రద్దగా వినుము' అని చెప్పసాగెను.
సువీర చరిత్రము
ద్వాపరయుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన 'సువీరుడు' అను రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రు రాజుల చేతిలో అపజయం పొంది భార్యతో కలిసి అరణ్యాలకు పారిపోయి, ధన హీనుడై, నర్మదా నదీ తీరమున పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలు, ఫలాలు తింటూ జీవించసాగాడు. కొంతకాలానికి అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆ పాపకు ఆహార సదుపాయాలు సరిగా లేకపోయినా జన్మతః క్షత్రియ కన్య అయినందున శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగింది.
ముని కుమారునితో వివాహం
ఆ బాలికకు యుక్త వయసు రాగానే ఒక ముని కుమారుడు ఆమెను చూసి, ఆమె అంద చందాలకు ముగ్ధుడై తనకిచ్చి వివాహం చేయమని సువీరుని కోరాడు. అప్పుడు ఆ రాజు "ఓ మునికుమారా! ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నీవు నాకు కొంత ధనము ఇచ్చిన నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను" అని చెప్పాడు. వెంటనే ముని కుమారుడు తన వద్ద ధనము లేనందున ఆ బాలికపై ఉన్న మక్కువతో ధనము సంపాదించడానికి నర్మదా నదీ తీరమునకు వెళ్లి అక్కడ కుబేరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ముని కుమారుని తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ఒక ధన పాత్ర ఇచ్చాడు. ముని కుమారుడు ఆ ధన పాత్రను రాజుకిచ్చి, అతని కూతుర్ని వివాహం చేసుకుని తన ఇంటికి వెళ్లి సుఖంగా కాలం గడపసాగాడు.
సువీరుని ధనాపేక్ష
ఇక్కడ సువీరుడు కూడా అల్లుడు ఇచ్చిన ధన పాత్రలోని ధనమును వాడుకుంటూ భార్యతో కలిసి హాయిగా కాలక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి సువీరునికి ఇంకొక కుమార్తె పుట్టింది. ఆమెను కూడా వారు అల్లారుముద్దుగా పెంచసాగారు. ఆ బాలిక కూడా యుక్తవయసుకు వచ్చింది. సువీరుడు ఆ బాలికను కూడా ఎవరికైనా అధిక ధనమునకు అమ్మేయడానికి ఎదురు చూడసాగాడు.
సువీరునికి సాధువు హితబోధలు
ఒక రోజు ఒక సాధుపుంగవులు తపతీ నది తీరం నుంచి నర్మదా నదీ తీరమునకు స్నానార్ధమై వెళుతూ మార్గమధ్యంలో సువీరుని కలుసుకుని "ఓయీ! నీవెవరు? నిన్ను చూస్తే రాజువలె ఉన్నావు. ఈ అరణ్యములో ఈ విధంగా భార్యాబిడ్డలతో సంచరించ వలసిన అవసరం నీకేమొచ్చింది?" అని ప్రశ్నించగా, సువీరుడు "ఓ మహానుభావా! నేను వంగ దేశమునకు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుకున్నారు. నేను రాజ్య భ్రష్టుడనై ఇలా భార్యా పిల్లలతో కలిసి అరణ్యాలు పట్టాను" అని చెప్పాడు. నా మొదటి కుమార్తెను ఒక ముని కుమారునికిచ్చి వివాహం చేసి, అతను ఇచ్చిన ధనము తోటి నేను జీవిస్తున్నాను" అని చెప్పగా, ఆ ముని ఆశ్చర్యముతో "ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనను కన్యను అమ్మి ఆ ధనముతో జీవించడం పంచ మహా పాతకములలో ఒకటి. ఆ ధనముతో దేవముని, పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారికి నరకం తప్పదు. అలాగే ధనము తీసుకుని కన్యను పెండ్లి చేసుకున్న వారికి కూడా నరకం తప్పదు. కావున నీ పాప పరిహారం కోసం రానున్న కార్తిక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరాణాలతో అలంకరించి ఒక యోగ్యుడైన వరుని కిచ్చి వివాహం జరిపించిన నీ పాపములు పోవును. ఈ విధముగా ఎవరైతే కార్తిక మాసంలో కన్యాదానం చేస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతేకాక నీ మొదటి కుమార్తెను అమ్మిన పాపం కూడా పోవును" అని ఆ సాధువు రాజునకు హితబోధ చేస్తాడు.
సాధువు హితబోధను పెడచెవిన పెట్టిన సువీరుడు
సాధువు బోధలు విని సువీరుడు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! ఈ లోకంలో దేహ సుఖం కంటే గొప్పది ఏది లేదు. భార్యా బిడ్డలతో కలిసి సిరిసంపదలతో జీవించడం ముఖ్యం అంతేగాని ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ఇప్పుడు ఉన్న సుఖాలను వదులుకోవడం అవివేకం. ఈ లోకంలో ధనమున్న వానికే అన్ని గౌరవాలు దక్కుతాయి. కావున నేను నా రెండవ కుమార్తెను కూడా ధనమునకు అమ్మివేస్తాను" అని నిక్కచ్చిగా చెప్పగా ఆ ముని ఆశ్చర్యపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.