తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహాశివుడి "కావడి యాత్ర" - ఈ యాత్ర గురించి మీకు తెలుసా? - జన్మజన్మల పాపాలన్నీ నశించిపోతాయి! - Kanwar Yatra 2024 Dates - KANWAR YATRA 2024 DATES

Kanwar Yatra 2024 Dates : ఉత్తరాదిలో శివభక్తులు శ్రావసమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో "కన్వర్ యాత్ర" చేపడతారు. దీనినే 'కావడి యాత్ర' అని కూడా అంటారు. అసలేంటి.. ఈ కన్వర్ యాత్ర? దాన్ని ఎందుకు చేపడతారు? ఈ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Kanwar Yatra 2024 Importance
Kanwar Yatra 2024 Dates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 1:50 PM IST

Kanwar Yatra 2024 Importance :హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాల్లో ఒకటి.. శ్రావణమాసం. ఈ మాసంలో భారతదేశమంతటా భక్తులు విశిష్టమైన పూజలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఉత్తర భారతంలో దక్షిణాది కంటే ముందుగానే శ్రావణం మాసం స్టార్ట్ అవుతుంది. అంటే.. ఉత్తరాదిలో జులై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఉత్తరాదిలో శివభక్తులు పరమశివుడి(Lord Shiva) ఆశీర్వాదం పొందేందుకు "కన్వర్ యాత్ర" చేపడతారు. దీనినే "కావడి యాత్ర" అని కూడా పిలుస్తారు. మరి.. ఇంతకీ కన్వర్ యాత్ర అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఈ సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుంది? విశిష్టత ఏమిటి? పాటించాల్సిన నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్వర్ యాత్ర అంటే ఏమిటంటే?

కన్వర్ అనేది ఒక వెదురు నిర్మాణం. దానికి ఇరువైపులా కుండలు కడతారు. దీన్నే కావడి అంటారు. ఈ కావడితో.. కాలినడకన గంగా జలాన్ని తీసుకొచ్చి తమ గ్రామాల్లోని శివాలయాలలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారు. అందుకే.. దీనికి కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర అనే పేరు వచ్చింది. ఇందులో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. వీరు కాషాయ రంగు దుస్తులు ధరించి గంగా నదిలో స్నానమాచరించి.. హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రదేశాల నుంచి గంగా జలాన్ని సేకరించి తీసుకొచ్చి శ్రావణమాసంలో మాసశివరాత్రి త్రయోదశినాడు శివుడికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

ఎందుకు చేస్తారంటే?

పరమశివుడికి ఇష్టమైన మాసంగా చెప్పుకునే శ్రావణమాసంలో కావడితో గంగా జలాన్ని తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో కన్వర్ యాత్ర చేపట్టి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు.

పురాణాలలో విశిష్టత :

పురాతన కాలం నుంచి కన్వర్ యాత్ర సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అంతేకాదు.. పురాణాలలో రాముడు, రావణుడితో సహ ఎంతో మంది ఈ యాత్ర చేసినట్టుగా చెప్పుకుంటారు. పురాణాలలోని కన్వర్ యాత్రకి సంబంధించిన ఒక కథను చూస్తే.. శివ భక్తుడైన పరశురాముడు మొదటి కన్వర్ యాత్ర చేపట్టాడని నమ్ముతారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని "పురా" అనే ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు.. అతను అక్కడ శివాలయానికి పునాది వేయాలనుకున్నాడట. అలాగే పరశురాముడు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివారాధన కోసం గంగాజలాన్ని తెచ్చినట్లు చెబుతారు.

శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు..?

ఈ ఏడాది కన్వర్ యాత్ర ఎప్పుడంటే?

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఉత్తరాది ప్రజలు పౌర్ణమి నుంచి పౌర్ణమిని ఒక మాసంగా భావిస్తారు. అంటే.. దీని ప్రకారం అక్కడ ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజుని శ్రావణ మాసం మొదటి రోజుగా లెక్కిస్తారు. ఈ లెక్కన కన్వర్ యాత్ర ఈ ఏడాది జులై 22 నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాస శివరాత్రి రోజు అంటే త్రయోదశి నాడు ఆగస్టు 2వ తేదీన ముగుస్తుంది.

పాటించాల్సిన నియమాలు :

  • కావడి యాత్ర చేయాలనుకునే వారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
  • కన్వర్ యాత్ర చేసేవారు మొదటగా స్నానం చేసిన తర్వాత మాత్రమే కన్వర్​ను తాకాలి. అలాగే భక్తులందరూ పాదరక్షలు లేకుండానే యాత్రలో పాల్గొనాలి.
  • అలాగే ఒకసారి కావడిని ఎత్తుకున్నప్పుడు దాన్ని పొరపాటున కూడా నేలపై ఉంచకుండా జాగ్రత్త పడాలి.
  • ఒకవేళ మీకు అలసిపోయినట్లు అనిపిస్తే కన్వర్​ను చెట్టు లేదా ఎత్తైన స్టాండ్​కి తగిలించుకునేలా చూసుకోవాలి.
  • ఎందుకంటే.. కన్వర్ నేల తాకితే ఆ గంగాజలం పవిత్ర తగ్గిపోతుందని భావిస్తారు.
  • అదేవిధంగా మద్యం, మాంసం, పొగాకు, గుట్కా, సిగరెట్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
  • వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక్ ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
  • కన్వర్ యాత్ర చేపట్టే వారు.. చెడు, ప్రతికూల ఆలోచనలు పొరపాటున కూడా మనసులోకి రాకుండా చూసుకోవాలి.
  • నిత్యం శివనామ స్మరణ చేస్తూ కావడి యాత్ర చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు పండితులు.

విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా?

జీవితంలో విజయానికి.. మహా శివుడు చెప్పిన రహస్యాలివే..!

ABOUT THE AUTHOR

...view details