Kanuma Festival Significance 2025 :రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారు. మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ. మొదటి రోజు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, రెండవ రోజు సిరిసంపదలను అందించే సంక్రాంతి. కనుమను ప్రధానంగా పశువుల పండుగగా చూస్తారు. సంవత్సరం మొత్తం రైతులకు సహాయపడే పశువులను ఈ రోజు పూజించి, వాటిని అందంగా అలంకరిస్తారు. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండుగలో ఒక్కోరోజుకు ఒక్కో పరమార్థం దాగి ఉంది. ఈ సందర్భంగా కనుమ పండుగ పరమార్థం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పశువుల పండుగ :
కనుమ నాడు అందరూ వేకువ జామునే తప్పకుండా తలంటు స్నానం చేస్తారు. ఎందుకంటే కనుమ రోజున కాకి కూడా మునుగుతుందట! ఈ రోజున కర్షకులందరూ పాడి పంటలను, పశుసంపదను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే రైతులు వ్యవసాయ పనిముట్లనూ పూజిస్తారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని శుభ్రంగా కడిగి అలంకరిస్తారు.
పశువుల కొమ్ములకు రంగులు వేసి, వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కడతారు. పశువులకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. ఈ రోజున కుటుంబంలోని పెద్దలను తలచుకుంటారు. ఇలా వ్యక్తులు, పశువులు, పనిముట్లను పూజించడంలో ఓ పరమార్థం దాగి ఉంది. అదేంటంటే మనకు మేలు చేసే వారిని మర్చిపోకూడదు అని కనుమ తెలియజేస్తుంది. అయితే, సొంతూళ్లకు వచ్చిన వారు కనుమ రోజుఊరి పొలిమేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే పండక్కి ఊరెళ్ళిన వారు ఈ రోజు తిరుగు ప్రయాణం చేయరు.