Nimmala Ramanaidu in Farming : రాష్ట్రానికి మంత్రి అయినా తాను ఒక రైతునే అని మరోసారి నిరూపించారు నిమ్మల రామానాయుడు. ఓ వైపు అమాత్యుడిగా తీరిక లేకుండా గడిపే ఆయనకు కాస్త విరామం దొరికే సరికి తనలోని రైతు బయటకు వచ్చారు. కనుమ పండగ నాడు సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో మంత్రి పర్యటించారు. ఈ క్రమంలో నిమ్మల తన పొలానికి వెళ్లి వరి చేనుకు పురుగుల మందు స్ప్రే చేశారు.
ఇప్పుడే కాదు మొదటినుంచి పొలం పనులు చేసుకోవడం రామానాయుడుకు ఇష్టం. రైతు కూలీలతో కలిసి ఆయన మమేకమవుతుంటారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా, అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడు సొంతంగా వ్యవసాయం చేసేవారు. అంతేకాక వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాలు దిగుబడి సాధించారు. మరోవైపు ఆక్వా సాగులోనూ మంచి ఫలితాలను రాబట్టారు. 2014, 2019, 2024 సంవత్సరాల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి నేడు మంత్రి పదవి చేపట్టినా వ్యవసాయ పనులు మాత్రం మర్చిపోలేదు.
వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమని నిమ్మల రామానాయుడు తెలిపారు. మంత్రిగా తీరిక లేకుండా ఉన్నా పొలంలోకి దిగి పనులు చేసుకోవడం నిజమైన సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రజలకు కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరమంతా పంటలు బాగా పండాలని, రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నిమ్మల ఆకాంక్షించారు.
"సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, కమ్మనైన పిండివంటలు, పల్లె వాతావరణం. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది రైతు. ఆ రైతు పండించిన ధాన్యం రాశులు సంక్రాంతికి ఇంటికి చేరి కళకళలాడుతాయి. అటువంటి పండగ నాడు నా సొంత పొలంలో నా సొంత మనుషులుతో పనిచేయడం నాకు తృప్తిని ఇచ్చింది. ఈ సంవత్సరమంతా పంటలు బాగా పండాలని, రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను." - నిమ్మల రామానాయుడు, మంత్రి
"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA