How to Reach Shrigonda Siddhivinayak Temple :మహారాష్ట్రంలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలను ఓ క్రమ పద్ధతిలోనే దర్శించుకోవాలి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ పూర్తి చేస్తేనే ఈ అష్ట వినాయక క్షేత్ర దర్శన ఫలం దక్కుతుంది. గత వారం తొలి క్షేత్రంమయూర గణపతి క్షేత్ర విశేషాలను తెలుసుకున్నాం. ఈ రోజు రెండవ సిద్ధి వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం.
సిద్ధి వినాయక క్షేత్రం ఎక్కడ ఉంది
సిద్ధి వినాయక క్షేత్రం మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద వెలసి ఉంది. అష్ట వినాయక క్షేత్రాలలో రెండవ క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలోని గణపతికి ఓ ప్రత్యేకత ఉంది.
వక్రతుండ మహాకాయ!
సాధారణంగా అన్ని గణపతి ఆలయాల్లో వినాయకుడి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. కానీ సిద్ధి వినాయక క్షేత్రంలో మాత్రం గణపతి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత!
సిద్ధి బుద్ధి ప్రదాత
సిద్ధివినాయక క్షేత్రంలో గణపతి సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. తన దర్శనానికి వచ్చిన భక్తులకు కార్యసిద్ధిని, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఈ గణపతి.
ఆలయ స్థల పురాణం
శ్రీమహావిష్ణువు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. ఆ క్రమంలో మధు, కైటభులనే రాక్షసులను సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడట! రాక్షస సంహారం తర్వాత శ్రీమహావిష్ణువు గణనాథుని పట్ల కృతజ్ఞతతో తానే స్వయంగా గణనాథుని ప్రతిష్ఠించి వినాయకునికి ఇక్కడ ఆలయం నిర్మించాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.