How To Organize Things At Home : మన ఇంట్లో వస్తువులు ఎప్పుడూ చక్కగా అమర్చుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ ఉంటే మంచిదని వాస్తు చెబుతోందో ఆ ప్రకారం ఇల్లు సర్దుకుంటే ఇంట్లో లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అలా లేకపోతే మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ వస్తువును ఎక్కడ, ఎలా పెట్టాలో తెలుసుకుందాం.
ఆ వస్తువులు అసలు ఉండకూడదు
భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంట్లో తప్పకుండా వాస్తు దోషం ఉన్నట్లే. ముఖ్యంగా ఇంటి యజమాని స్థానం అయిన నైరుతి పడక గదిలో మంచం తూర్పు గోడకు ఆనించి ఉండకూడదు. అలాగే దంపతులు నిద్రించే మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి. ఇంట్లోని దంపతులు నిద్రించే పడక గదిలో పనికిరాని, పగిలిపోయిన వస్తువులు ఉంచరాదు. అది దంపతుల మనఃశాంతిని దూరం చేస్తుంది. తరచూ గొడవలు పడుతూ ఉంటారు. మీ ఇంటి పడక గదిలో ఇలాంటి పనికిరాని వస్తువులు ఉంటే తక్షణమే బయట పడేయండి. అలాగే అద్దాల బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్ వంటివి కానీ ఉంచరాదు. పడగ గదిలో అద్దాల బీరువాలు అనర్థదాయకం. అద్దం లేని బీరువాలను ఉంచుకోవచ్చు. నైరుతి పడకగదిలో డబ్బులు ఉంచే బీరువాను ఉత్తరం దిశలో దక్షిణం చూసే విధంగా అమర్చుకుంటే నగదుకు లోటుండదు.
నరఘోషతో తస్మాత్ జాగ్రత్త!
ఎంత గొప్ప వాస్తు ఉన్న ఇంటికైనా నరఘోష లేకుండా ఉండదు. నరఘోషకు నల్ల రాయైన పగులుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఈ నరఘోష నుంచి కాపాడుకోవడం కోసం వాస్తు ప్రకారం ఉన్న ఈ చిట్కాలు పాటించండి.
- మూడు నిమ్మకాయలు, ఒక ఎర్ర మిరపకాయ కలిపి ఒక దారానికి గుచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి కడితే నరఘోష నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి శుక్రవారం వీటిని మార్చి మళ్లీ కొత్తగా కట్టుకోవాలి.
- అలాగే ఒక శుభప్రదమైన రోజు మంచి సమయం చూసి బూడిద గుమ్మడికాయను ఉట్టిలో పెట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టుకోవాలి. ఇలా చేయడం వలన నరఘోష ప్రభావం ఇంట్లోని వారికి తగలదు. అయితే ఈ గుమ్మడికాయ బాగా కుళ్లిపోయే వరకు ఉంచి అప్పుడు కొత్తది మార్చుకోవాలి. గుమ్మడికాయ కుళ్లిందంటే నరఘోష కూడా పోయినట్లే అని అర్ధం చేసుకోవాలి.
- పటికను నల్లదారంతో కట్టి ఇంటి గుమ్మంపైన ఉండేలా అమర్చుకుంటే నరఘోష తప్పకుండా పోతుంది.
ఇల్లాలే కీలకం!
ఇంట్లో వస్తువులు సర్దుకోవడం దగ్గర నుంచి, ఇంట్లోని వారికి నరఘోష తగలకుండా చూసే బాధ్యత ఇంటి ఇల్లాలిదే. మనం నివసించే ఇల్లు ఎప్పుడు జీవకళ ఉట్టిపడేలా ఉండాలి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇల్లు ఎప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండాలి. ఇంట్లో జీవకళ ఉంటే ఇంట్లోని వారందరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. జీవకళ లేని ఇంట్లో ఎలాంటి పురోగతి ఉండదు.