How to light Karthika Masam Deepam :శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తికం. హిందూ సంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు. చాలా మంది ఈ మాసంలోస్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటివి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తిక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్ కుమార్' చెబుతున్నారు. ఏ ఆలయాల్లో దీపాలను ఏ విధంగా వెలిగించాలో ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కార్తిక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించే విధానం..
ఈ కార్తిక మాసంలో చాలా మంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఆ మూడు ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం గోపుర ద్వారం. మీరు ఆలయానికి వెళ్లగానే గోపురం కనిపిస్తుంది. అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత మూడవ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలని స్కంధపురాణంలో చెప్పారు.
కార్తిక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించే విధానం..
కార్తిక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధివిధానం పాటించాలి. దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం మనం చూస్తుంటాం. కానీ, ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి.