How To Do Pradakshinalu In Temple : హిందూ సంప్రదాయం ప్రకారం దైవారాధనలో భాగంగా ఆలయంలో ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. సాధారణంగా దేవాలయానికి వెళ్లిన భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ సమస్యలు తీరడానికి, మనోభీష్టాలు నెరవేరడానికి ఈ ప్రదక్షిణలు ఎంతో దోహదం చేస్తాయి. అయితే ఈ ప్రదక్షిణాలకు కూడా ఓ లెక్కుంది. సరిగా చేస్తేనే సానుకూల ఫలితాలుంటాయి లేకుంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో చూద్దాం.
శివాలయంలో ప్రదక్షిణలు చేయాల్సిన విధి విధానాలు
వ్యాస మహర్షి రచించిన లింగ పురాణంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసే విధి విధానాల గురించిన వివరణ ఉంటుంది. శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుంచి చండీశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి, చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి అభిషేక జలం బయటకు వెళ్లే సోమ సూత్రం వరకు వెళ్లి, తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. మరల వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధంగా చేసే ప్రదక్షిణకే 'చండీ ప్రదక్షిణం' లేదా 'సోమసూత్ర ప్రదక్షిణ' అని పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచే పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధ గణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో వివరించారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు
సాధారణంగా ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు నందికి శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదే ఉంటాయి. అలాగే విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుని కానీ, దేవతను కానీ దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. ఆ తరంగాల శక్తిని సిద్ధపురుషులు తప్ప సామాన్య మానవులు భరించలేరు. అందుకే దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు ఒక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తారు.