How to Do Deepa Danam in Karthika Masam: పరమ పవిత్రమైన కార్తీక మాసం.. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. అయితే కార్తిక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తైతే దీపదానం మరో ఎత్తని చెబుతారు. ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఏఏ తిథుల్లో చేస్తే మంచిది? ఎన్ని వత్తులు వేసి దానం చేయాలి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దీపదానం ఎలా చేయాలి:కార్తిక మాసంలో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. దీపం ఎలా తయారు చేయాలి? ఎక్కడ దానం ఇవ్వాలో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే..
- దీపదానం చేయాలనుకునే వారు తలస్నానం చేయాలి.
- గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం తురుము, ఆవుపాలు పోసుకుని కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి.
- ఆ తర్వాత పైడిపత్తి తీసుకుని స్వయంగా చేతిలో నలుపుతూ వత్తులు చేయాలి.
- ఇలా తయారు చేసిన వత్తులను పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి.
- ఇలా వెలిగించిన దీపాలను శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణం, నదీ తీరం, రావి చెట్టు, తులసి కోట, ఉసిరి చెట్టు, మర్రిచెట్టు లేదా గృహంలో ఎక్కడైనా దీపదానం చేయవచ్చని మాచిరాజు చెబుతున్నారు.
ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం:
- కార్తిక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
- పది దీపాలు వెలిగించి దానం ఇస్తే మహా పాపాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
- వంద దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుందని చెబుతున్నారు.
- వంద కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పినట్లు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ఎన్ని వత్తులు వేసి దీపం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు:
- కార్తిక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
- నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజ యోగం కలుగుతుందని సూచిస్తున్నారు.
- 10 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని అంటున్నారు. చక్రవర్తిత్వం అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుతారని చెబుతున్నారు.
- 100 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని అంటున్నారు.
- 100 కంటే ఎక్కువ వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే పునర్జన్మ ఉండదని.. మోక్షం లభిస్తుందని అంటున్నారు.
ఏ తిథిలో దానం చేస్తే ఎలాంటి ఫలితం:కార్తిక మాసంలో శుక్ల పక్షం లేదా బహుళ పక్షంలో అంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథులలో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కాంద పురాణంలో చెప్పినట్లు మాచిరాజు చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే
- పాడ్యమి లేదా చవితి తిథి రోజు దీపదానం చేస్తే ముత్తైదువులకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతున్నారు.
- విదియ రోజు దానం చేస్తే స్ససంతాన ప్రాప్తి కలుగుతుందని వివరిస్తున్నారు.
- తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయని తెలుపుతున్నారు.
- పంచమి రోజు దీప దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.
- షష్ఠి తిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మండమైన పదవి లభిస్తుంది.
- సప్తమి రోజు దీప దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుందని సూచిస్తున్నారు.
- చతుర్దశి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుందని అంటున్నారు.
- క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు దీప దానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసిదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని అంటున్నారు.