తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సీతమ్మ లంకలో ఉన్న సంగతి - హనుమంతుడికి ఎలా తెలిసింది? - HOW HANUMAN FOUND SITA IN LANKA

- ఈ ఆసక్తికర విషయం రామ భక్తులు తెలుసుకోవాల్సిందే!

How Anjaneya Found Sita in Lanka
How Anjaneya Found Sita in Lanka (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 1:48 PM IST

Updated : Feb 12, 2025, 1:58 PM IST

How Anjaneya Found Sita in Lanka :బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడిని అంతం చేసిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలలోని కుటీరం వద్దకు పరుగు పరుగున వచ్చారు. సందేహించినంతా జరిగింది. కుటీరంలో సీతమ్మ కనిపించలేదు. ఎటు వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? ఎటు వైపు తీసుకెళ్లారు? ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ రామలక్ష్మణులకు తెలియలేదు. లంకలో ఉందని హనుమంతుడు చెప్పేవరకు సీతాదేవి ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. మరి, సరిగ్గా లంకలో సీతమ్మ ఉందని ఆంజనేయుడు ఎలా తెలుసుకున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాదేవి జాడ వెతుక్కుంటూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వతం వైపు వెళ్లారు. అక్కడ సుగ్రీవుడు, అతని వానర సైన్యం కనిపించారు. రామయ్య తమ సమస్య చెప్పగా, సుగ్రీవుడు తన కష్టాలు చెప్పాడు. అలా వాళ్ల మధ్య మైత్రి కుదిరింది. ఈ క్రమంలోనే సీతాన్వేషణ ఎలా సాగించాలో తన వానరసేన ప్రముఖులకు సూచించాడు సుగ్రీవుడు. నాలుగు దిక్కులలో ఏ వైపు వెళ్తే ఏ ప్రాంతం వస్తుందో? ఎక్కడెక్కడ ఎలాంటి కొండలు, గుట్టలు, మైదానాలు ఉంటాయో, ఎక్కడ సముద్రం, నదులు, చెరువులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎలాంటి అడ్డంకులు ఉంటాయో, ఎలాంటి విశేషాలున్నాయో పొల్లు పోకుండా అన్నీ వివరించాడు. అది విన్న శ్రీరాముడు ఆశ్చర్యానికి గురవుతాడు. ఈ భూమండలం గురించి సుగ్రీవుడికి ఇంత గొప్ప జ్ఞానం ఎలా లభించిందో అనుకుంటాడు. అదే విషయాన్ని అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా వివరిస్తాడు. తాను చెప్పిన వివరాలన్నీ ఊహించి చెప్పినవి కావని, ఆ ప్రాంతాలన్నీ తాను గతంలో తిరిగినట్టు చెబుతాడు.

అన్న వేటాడంతో :

సోదరుడు "వాలి" సుగ్రీవుడిని కిష్కింద నుంచి బహిష్కరించడమే కాకుండా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నిలువనీడ లేకుండా చేస్తుండేవాడు. అలా ఒక చోటి నుంచి మరొక చోటికి మారుతూ తాను ఈ ప్రదేశాలన్నిటినీ చూశానని సుగ్రీవుడు చెబుతాడు. అంతకు ముందు "మాయావి" అనే రాక్షసుడిని చంపడానికి వాలి తరిమిన సమయంలో, తన అన్నవెంట ఉండి మరికొన్ని ప్రదేశాలను చూశానని చెబుతాడు. అసలు తమ అన్నదమ్ములకు వివాదం వచ్చింది ఈ మాయావి కారణంగానే అని చెబుతాడు సుగ్రీవుడు.

వాలి మాయావిని తరుముకుంటూ పోగా, ఆ రాక్షసుడు ఒక గుహలోకి దూరుతాడు. ఎలాగైనా అంతం చేయాలంటూ వాలి కూడా అందులోకి వెళ్తాడు. సుగ్రీవుడు బయటే కాపలా ఉంటాడు. లోపల రోజుల తరబడి యుద్ధం సాగుతూ ఉంటుంది. ఎన్నిరోజులైనా సోదరుడు బయటకు రాకపోవడంతోపాటు గుహ లోపలి నుంచి రక్తం ధారకడుతుంది. దీంతో, మాయావి సైన్యం వాలిని చంపేసి ఉంటారని, బయటకు వస్తే కిష్కంధ పైకి దండెత్తి వస్తారనే భయంతో గుహ ద్వారాని ఒక పెద్ద రాతి బండను అడ్డుగా పెట్టి, రాజ్యానికి వెళ్లిపోయాడట సుగ్రీవుడు.

వాలి మరణించాడని చెప్పడంతో, రాజ్య మంత్రులు నువ్వే రాజుగా ఉండాలని తనమీద భారం పెట్టారని చెప్పాడు సుగ్రీవుడు. అలా సింహాసనం అధిష్ఠించిన కొన్ని రోజులకు వాలి ఆ మాయావిని వధించి, బయటకు వచ్చేశాడట. రాజ్యానికి వచ్చిన అన్నకు నమస్కరించి, ఏం జరిగిందో చెప్పి, సింహాసనాన్ని అధిష్ఠించమని కోరాడట. అయినా వాలి వినకుండా జుట్టుపట్టుకుని తనను కిందకు లాగి చంపబోయాడని, తాను తప్పించుకోవడానికి అన్ని దిశలకూ పరుగులు పెట్టానని సుగ్రీవుడు శ్రీరాముడికి చెప్పాడు.

తిరగని చోటు లేదు :

వాలిని తప్పించుకొని సముద్రం వరకూ వెళ్లాడట. అక్కడికి వాలి రావడంతో కొండవైపు పరుగు తీసినట్టు చెప్పాడు. కొండల నుంచి ఉదయించే సూర్యుని వేగంతో వాలి వెంబడించేవాడని, తప్పించుకునేందుకు దక్షిణ దిక్కుకు వెళ్లాడట. ఆ వైపునున్న పర్వతాలకు, నాగదేవతలకు తనను రక్షించాలని వేడుకొని, అగస్త్యుడు తపస్సు చేసిన దివ్య ప్రాంతాలను చూసినట్టు సుగ్రీవుడు రాముడికి చెప్పాడు. అక్కడికీ వాలి రావడంతో పశ్చిమ దిశలో మేరుసావర్ణి దాకా ప్రయాణించాడట. అయినా వాలి వదలకపోవడంతో ఉత్తర దిశలోని హిమాలయాలకు పారిపోయాట. అక్కడ కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే క్రౌంచగిరికి, అట్నుంచి సోమగిరికి ఇలా, ఎన్నో ప్రాంతాలు చుట్టివచ్చినట్టు సుగ్రీవుడు తెలిపాడు.

ఇక్కడకు రాలేడని :

చివరకు రుష్యమూక పర్వతం వద్ద జీవిస్తున్నట్టు సుగ్రీవుడు చెప్పాడు. ఇక్కడ వాలి అడుగు పెట్టలేడు. కారణం ఏమంటే, వాలికి మాతంగ మహాముని శాపం ఉంది. అందువల్లే ఇక్కడకు రాలేడని, దాంతో తాను ఇక్కడే స్థిరపడినట్టు సుగ్రీవుడు రామయ్యకు తెలిపాడు. అలా తనకు అన్ని ప్రదేశాలపైనా పట్టు ఉందని, అది ఇలా సీతాన్వేషణలో ఉపయోగపడుతోందని అన్నాడు. ఆయా దిక్కుల వివరాలను వానర ప్రముఖులకు స్పష్టంగా చెప్పి, తలో దిక్కుకు సైన్యాన్ని ఇచ్చి పంపించాడు సుగ్రీవుడు. అలా దక్షిణ దిశగా వెళ్లిన హనుమంతుడు సముద్ర తీరం వరకూ వెతికినా సీత జాడ తెలియలేదు. "చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు" కనుక సముద్రాన్ని కూడా దాటి లంకను చేరుకున్నాడు. అలా ఆశోక వనంలో ఉన్న సీతమ్మను ఎట్టకేలకు ఆంజనేయుడు కనిపెట్టాడు.

ఇవి కూడా చదవండి :

ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే - హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఇంట్లో హనుమాన్ చిత్రాన్ని ఏ దిశలో పెట్టాలి? - వాస్తు ఏం చెబుతుందో తెలుసా?

Last Updated : Feb 12, 2025, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details