ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / spiritual

మహాకుంభమేళాలో వేల సంఖ్యలో నాగసాధువులు - వాళ్లు ఏం తింటారో తెలుసా? - WHAT NAGA SADHUS EAT

దేశంలోని అన్ని దారులు ప్రయాగ్​రాజ్​ వైపే! - మహా కుంభమేళాలో వేలాది మంది నాగ సాధువులు!

naga_sadhuvulu_mahakumbhmela
naga_sadhuvulu_mahakumbhmela (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 3:06 PM IST

How do Naga Sadhus live :మన దేశంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా. నేడు భారతశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనడానికి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మహా కుంభ మేళాలో దిగంబర రూపంలో, దేహమంతా విభూతి పూసుకుని, చేతిలో ఆయుధం ధరించే నాగ సాధువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జడలు కట్టిన శిరోజాలతో ఎర్రటికళ్లతో భయానకంగా ఉండే వీరు చీమకు కూడా అపకారం చేయరు. కానీ, ధర్మానికి అపచారం జరిగినట్లు భావిస్తే ప్రళయకాలరుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని అందరూ వినడమే కానీ ప్రత్యక్షంగా చూసినవారు చాలా తక్కువ!

నాగ సాధువులు పవిత్ర కుంభమేళాసమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకు వస్తారు. ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్లిపోతుంటారు. అయితే, చాలా మందికి నాగ సాధువులు ఏం తింటారు? ఎముకలు కొరికే చలిలో కూడా వీరికి ఇంతటి శక్తి ఎలా వస్తుంది ? అని రకరకాల ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

నాగ సాధువులు (ETV Bharat)

ఈ సంప్రదాయం ఎలా వచ్చింది?

నాగ సాధువుల సంప్రదాయం తెలపడానికి భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. శంకర భగవత్పాదులు దేశంలోని నాలుగు దిక్కులా బదరీనాథ్‌, ద్వారకా, పూరి, శృంగేరిల్లో పీఠాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు కొన్ని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి. దీనినే దశనామి సంప్రదాయంగా పరిగణిస్తున్నారు. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగ సాధువులు ఉన్నారు. మొదట్లో యుద్ధవిద్యలో ప్రవీణులైనా ప్రస్తుత ఆధునిక కాలంలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అయితే యుద్ధవిద్యల శిక్షణ మాత్రం ఇంకా కొనసాగుతోంది.

నాగ సాధువుల్లో ఎలా చేరాలి?

నాగ సాధువులుగా మారడం క్షిష్టతరమైన ప్రక్రియ. వీరు 'శంకరం, శంకరాచార్యం, కేశవం' అని నినదిస్తారు. దీని అర్థం ఏంటంటే ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 'నాగ' అనే పదానికి భౌతికమైన వాంఛలను పరిత్యజించి, ఎలాంటి ప్రేమ అనురాగ బంధాలు లేని కఠోరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇందులో చేరవచ్చు. సాధారణంగా కుంభమేళా సమయంలో కొత్తవారిని చేర్చుకుంటారు. అనేక వడపోత కార్యక్రమాల తర్వాత ఇందులో చేరేవారు శిరోముండనం చేసుకొని ఎవరికి వారే సొంతంగా పిండ ప్రదానం చేసుకోవాలి. దీనితో ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆపై మౌని అమవాస్యనాడు అమృతస్నానం చేస్తారు. ఏ అఖాడాలో చేరితే ఆ ఆచార్య మహామండలేశ్వరుడు తమ శాఖలోకి స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు అఖాడాలో ఎలా ఉండాలో తెలియజేస్తారు.

నాగ సాధువులు (ETV Bharat)

నాగ సాధువులు ఏం భుజిస్తారు?

నాగ సాధువులు ఎక్కువ కాలం ఉపవాసదీక్షలో ఉంటారు. ఆహారం, ఆహార్యంపై వీరికి పెద్దగా పట్టింపు ఉండదు. పండ్లు, దుంపలు తీసుకుంటారు. ప్రపంచంలో జరిగే ఏ అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా జీవిస్తారు.

అఘోరాలకు వీరికి సంబంధం ఉందా?

సాధారణంగా అఘోరాలు వామాచారాలను పాటిస్తారు. నాగసాధువులు కేవలం కుంభమేళాలకు మాత్రమే వస్తారు. ఎంత దూరమైనా ఎలాంటి పాదరక్షలు ధరించకుండా విభూతిధారులై నడుస్తారు. కుంభమేళాకు హాజరయ్యే వీరిని దర్శించుకుంటే మంచిదని కోట్లాది మంది భక్తుల నమ్ముతారు.

అన్నింటిని అధిగమించి :

ఎముకలు కొరికే చలిలోనూ, నిప్పులు చెరిగే భానుడి తీవ్రతలోను నాగసాధువులు చలించరు. యథాప్రకారం తమ నిత్య కార్యాలు చేపడతారు. నాగసాధువుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కుంభమేళాలు జరిగే తీర్థాలకు మాత్రమే హాజరవుతారు. తర్వాత వెళ్లిపోతారు. ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు ఉండవు. వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఆధ్యాత్మిక ఘనకీర్తి మన దేశానికి ఉంది. లోకకల్యాణం కోసం తరతరాల ఆచారాలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా దివ్యప్రభను మనకు అందిస్తున్న నాగసాధువులకు అనంత ప్రణామాలు చెప్పాల్సిందే!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

నవగ్రహాల ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? - తర్వాత కాళ్లు కడగొచ్చా?

లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే సంకేతాలివే - కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందంటే!

ABOUT THE AUTHOR

...view details