Special Story Of Boya :హిందూ మత విశ్వాసం ప్రకారం సత్యం పలకడం అన్ని ధర్మాల కన్నా మిన్న. ఒక్క సత్యాన్నే నమ్ముకుంటే చాలు ఏదైనా సాధించగలమని తెలియజేసే సత్యవ్రతుని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
సత్య వ్రతునిగా బోయ ఎలా మారాడో తెలిపే కథ
బోయ సత్యవ్రతం
పూర్వం అరుణి అనే ముని ఉండేవాడు. ఆయన దేవకీ నదీతీరంలో నియమ నిష్ఠలతో కూడి, నిత్యం ధ్యానమగ్నుడై ఉండేవాడు. ఒకరోజు ఆయన ఎప్పటిలాగే స్నానం చేయడానికి తన దండ కమండలాలు, నారదుస్తులు ఒడ్డున పెట్టి, స్నానం చేయడానికని నదిలో దిగబోతుండగా, ఒక వేటగాడు అక్కడికి వచ్చి ఆ దుస్తులు, దండ కమండలాలు తనకు ఇచ్చెయ్యమని బెదిరించాడు. ముని అతని వైపు తదేకంగా చూశాడు. మహా తపశ్శాలి అయిన ఆ ముని కరుణాపూరితమైన చూపులతో ఆ వేటగాడిలోని క్రూరత్వం నశించిపోయింది. ఆ స్థానంలో దయ, జాలి, పెద్దల పట్ల గౌరవం వచ్చింది.
బోయలో పరివర్తన
ముని కరుణాపూరిత చూపులతో పరివర్తన చెందిన బోయ వెంటనే తన విల్లంబులను, ఇతర ఆయుధాలను కింద పడవేసి, తల వంచి భక్తితో మునికి నమస్కరించి, 'మహానుభావా మీ కన్నులలో ఏమి మహత్తు ఉన్నదో కానీ, మీరు నన్ను చూసిన మరుక్షణం నాలోని హింసా ప్రవృత్తి నశించింది. మనసులో తెలియని శాంతి, స్థిమితం నెలకొంది. మీ చూపులకే అంత శక్తి ఉంటే, మీ వాక్కులకు ఇంకెంతో మహిమ ఉంటుందో దయచేసి నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించండి. నేను నా హింసా ప్రవృ త్తిని విడనాడి, భూత దయను కలిగిఉండి, ఆ మంత్రాన్ని జపిస్తూ, నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను' అని ప్రాధేయపడ్డాడు. కానీ ముని మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.
మునికి సేవలు చేసిన బోయ
వేటగాడు మాత్రం మునిని వదిలిపెట్టకుండా ఆయననే అనుసరిస్తూ, సపర్యలు చేస్తుండేవాడు. ఓనాడు ముని దర్భ పొదల నుంచి దర్భలు సేకరిస్తూ ఉండగా, ఎక్కడినుంచో పులి వచ్చి మీద పడింది. అక్కడేఉన్న ఆ బోయ తన చేతనున్న గొడ్డలితో దాని మీద ఒక్క దెబ్బ వేశాడు. కానీ ముని మాత్రం పులి వంక చూసి, ‘ఓం నమో భగవతేవాసుదేవాయ' అని అన్నాడు. ఆ మంత్రం చెవిన పడగానే పులి దివ్యదేహాన్ని ధరించి, మునికి నమస్కరించి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.
బోయకి సత్యవ్రతాన్ని బోధించిన ముని
జరిగిన ఘటన ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న బోయవాడితో ముని 'ఎప్పడూ సత్యాన్నే పలుకు, తినకూడనిది ఏదీ తినవద్దు. దీనినే వ్రతం లా ఆచరించు' అని చెప్పి వడివడిగా సాగిపోయాడు. మహాత్ముల చేష్టలకు అర్థాలు వేరుగా ఉంటాయి కదా.
బోయ సత్యవ్రతం
ముని బోధించిన సూక్తులు మహద్భాగ్యంగా భావించి బోయ ఆనాటి నుంచి ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ, అహింసా వ్రతాన్ని చేపట్టి, నిష్ఠగా జీవించసాగాడు. ఓ రోజున వేటగాడికి అడవిలో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు. దాంతో పండుటాకులను తినబోయాడు. అప్పుడు అశరీరవాణి వాటిని తినవద్దు అని పలికింది. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. మర్నాడు కూడా అలాగే జరగడం వల్ల కటిక ఉపవాసం ఉంటూ, ముని పాదపద్మాలనే మనసులో తలచుకుంటూ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. రోజులు గడిచాయి.
దుర్వాసునికి బోయ ఆతిధ్యం
ఓ రోజు దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. ఆయనను చూసి భక్తితో నమస్కరించి, 'స్వామీ దయచేసినా ఆతిథ్యం స్వీకరించండి' అని పలికాడు బోయ. అతను బక్కచిక్కి ఉన్నాడు కానీ, ముఖంలో దివ్య వర్చస్సు ఉట్టిపడుతోంది. అతన్ని పరీక్షించాలని దూర్వాసుడు 'వత్సా, నాకు బాగా ఆకలిగా ఉంది. మృష్టాన్న భోజనం చేయాలని ఉంది. నువ్వే నిరాహారంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. ఇక నాకేమీ పెట్టగలవు?' అనడిగాడు.
దుర్వాసుని కోసం భిక్షాటన చేసిన బోయ
దుర్వాసునికి ఆతిథ్యం ఇవ్వడానికి బోయ ఒక పాత్ర తీసుకుని, పక్కనున్న గ్రామానికి బ్రాహ్మణుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లాడు. ప్రతి ఒక్కరూ అతన్ని ఆదరించి, బోలెడన్ని శాకపాకాలను పాత్రలో నింపి పంపారు. అతను సంతోషంతో ముని వద్దకు వచ్చి 'స్వామీ దయచేసి భిక్ష స్వీకరించండి' అని కోరాడు.
బోయ వెంట నడిచిన నది
దూర్వాసుడు నేను స్నానం చేయనిదే ఏమీ తినను. నదిచూడబోతే చాలా దూరంలో ఉంది. నేను అక్కడికి వెళ్లలేను. నీవేనా స్నానానికి ఏర్పాట్లు చేయి అన్నాడు. ఆ వ్యాధుడు దేవకీ నది వద్దకు వెళ్లి, భక్తితో నమస్కరించి, 'అమ్మా నేను దూర్వాస మహర్షికిఆతిథ్యం ఇవ్వదలచుకున్నాను. ఆయన స్నానానికి ఇక్కడకు రాలేని పరిస్థితులలో ఉన్నాడు. నేనేగనక సత్యం పలికేవాడినయితే నువ్వు నాతోబాటు వచ్చి, ముని స్నానానికిసహకరించు' అని కోరాడు. దేవకీ నది వెంటనే అతని వెంట వచ్చింది. దూర్వాసుడు నదిలో స్నానం చేసి అతని, ఆతిథ్యం స్వీకరించాడు.
సత్య వ్రతుడిగా మారిన బోయ
బోయ సత్యవ్రతాన్ని చూసి దుర్వాసుడు అతనిపై అనుగ్రహంతో "నాయనా! నీ సత్యనిష్ఠకు, భక్తిశ్రద్ధశ్రద్ధలకు సంతోషించాను. ఇక నుంచి నీవు సత్యవ్రతుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అంతేకాదు, సకల శాస్త్రాలలోనూ పాండిత్యాన్ని పొందుతావు " అని ఆశీర్వదించాడు. ఈ సత్యవ్రతుడే తర్వాతి కాలంలో రాజయ్యాడు. మహాత్ములు చెప్పిన దానిని శ్రద్ధగా విని, దానిని నిష్ఠతో పాటించడం వల్లనేకదా, సత్యవ్రతునికి అంతటి ఖ్యాతి లభించింది. అందుకే సత్యవ్రతాన్ని మించిన వ్రతం లేదని, అహింసకు మించిన ధర్మం లేదని పెద్దలు అంటారు.
ఇలాంటి కథలు పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో సత్యం పలకడం పట్ల ఆసక్తిని కలిగించి సత్యం ఎంత గొప్పదో అర్ధం అయ్యేలా చేసి సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దవచ్చు.
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.