Hanuman Sindoor Pooja On Tuesday : ఆంజనేయునికి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు మంగళవారం. ఆ రోజున స్వామిని పూజిస్తే కుటుంబంలో సంతోషాలు వెళ్లివిరుస్తాయని పండితులు చెబుతారు. ఆ రోజు ఆంజనేయున్ని తమలపాకులతో గానీ, సింధూరంతో గానీ పూజిస్తే మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని అంటుటారు. అసలు ఆంజనేయుడికి ఎందుకు తమలపాకులు, సింధూర పూజ అంటే ఇష్టమో? ఆ పూజ వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింధూర పూజ చేస్తే ఫలితం ఉంటుందా?
సీతమ్మ వారిని దర్శించినప్పుడు హనుమంతుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుంటే చూసి అడిగాడు. అప్పుడు సీతమ్మ వారు శ్రీరాముని క్షేమం, సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తాను అని చెబుతుంది. అది విన్న హనుమంతుడు సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే రాముడికి ఇంకా మంచి జరుగుతుందని రాసుకున్నాడంట! అయితే శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతుంటే, అది ఊడిపోకుండా ఉండేందుకు నువ్వుల నూనెలో కలిపి రాసుకున్నాడంట. అందుకే ఆంజనేయుని పూజల్లో సింధూర పూజ ప్రధానమైనది. గంగ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి గాని, చిత్రపటానికి అలంకరించినట్లైతే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
తమలపాకు పూజ ఎందుకు ఇష్టం
సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు ఆమె జాడను తెలుసుకొని తిరిగి శ్రీరాములవారి దగ్గరకు బయలుదేరాడు. హనుమంతుని రాక కోసం వానరులు అందరు ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు, పూలు ముఖ్యంగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేసి ఘనంగా స్వాగతం పలికారంట. అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి. సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వలన స్వామి ఎంతో ప్రీతి చెందాడు. మరొక ముఖ్య విషయమేమిటంటే ఆంజనేయస్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే హనుమను తమలపాకులతో పూజించడం వలన సకల అభీష్ఠాలు సిద్ధిస్తాయి.
అరటిపండ్లు ఎందుకు సమర్పించాలి?
శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాదన పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్లి ఇలా అన్నాడంట! నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు. అందుకే ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరం ఇచ్చాడంట. అందుకే ఆంజనేయునికి అరటిపండ్లు సమర్పిస్తే హనుమంతుడితో పాటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చు.