Hanuman Jaya Mantram In Telugu: అనుకోని ఆపదలు సంభవించినప్పుడు ఆందోళనకు గురి కావడం సహజం. అలాంటప్పుడు అయోమయానికి లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్ధం కాదు. ఆపదలు సంభవించిన క్లిష్టమైన సమయంలో రక్షించే హనుమ జయ మంత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికి తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఎంతో ఆశగా ఉంటుంది. అయితే కొందరు ఎంత శ్రద్ధాసక్తులతో పనులు మొదలుపెట్టినా, ఏదో అడ్డంకుల వల్ల ఆగిపోతుండటం లేదా పని అసలు మొదలు కాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్లు ఏమి చేయాలో తోచక చాలా సంఘర్షణ అనుభవిస్తూ ఉంటారు.
హనుమ జయ మంత్రం
ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి జయ మంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ, పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు సాగితే అన్ని సానుకూలంగా జరుగుతాయని వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండలో వివరించడం జరిగింది. ఎంత కఠినమైన సమస్యలు ఉన్నా సరే జయ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠిస్తే ఒక్కసారిగా మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది! సమస్యలు తీరి ఆపద తొలగిపోయిన తరువాత చిన్న పిల్లలకు పానకం, వడపప్పు పంచితే మారుతి ఉప్పొంగిపోతారు!
అసలేమిటి జయమంత్రం?
దశరథ మహారాజు మునుపెన్నడో కైకేయి ఇచ్చిన వరాలను ఆమె శ్రీరామ పట్టాభిషేకానికి సరిగ్గా ఒక్క రోజు ముందు కోరుకుంటుంది. శ్రీరాముని అరణ్యవాసానికి పంపాలని, భరతునికి పట్టాభిషేకం చేయాలని కైకేయి కోరగా దశరథ మహారాజు తల్లడిల్లిపోతాడు. అయితే పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు తన తండ్రికి నచ్చచెప్పి సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యవాసంలో అష్టకష్టాలు పడిన రాముడు చివరకు రావణాసురుడు వచ్చి సీతను అపహరించుకొని వెళ్లాక ఆగ్రహానికి గురవుతాడు. సీతాదేవి కనిపించక రాముడు ఆవేదనకు గురవుతాడు. వానర రాజు సుగ్రీవుని సహాయంతో సీతాన్వేషణకు నలుదిక్కులా దూతలను పంపిస్తాడు. ఈ సందర్భంగా దక్షిణ దిక్కుకు దూతగా వెళ్లిన హనుమంతుడు సీతను కనుగొని ఆమెకు శ్రీరాముడు ఇచ్చిన ఆనవాలును చూపించి ఆమె దుఃఖాన్ని తగ్గిస్తాడు. రామాయణంలోని ఈ భాగాన్ని సుందరకాండ అంటారు.
శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుడిని, కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం జయ మంత్రం! శ్రీ ఆంజనేయ స్వామివారి జయమంత్రం శ్రీరామాయణంలోని సుందరకాండలో ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని నియమనిష్టలతో ప్రతిరోజూ కానీ, ఆపదలు సంభవించి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కానీ పఠిస్తే తప్పకుండా ఆపదలు తొలగిపోయి, హనుమ అనుగ్రహంతో కష్టం నుంచి బయటపడతాం. ఇది తధ్యం!
జయత్యతి బలో రామః అంటూ మొదలై సర్వ రక్షసాం!! అంటూ ముగిసే ఈ మంత్రాన్ని రామాయణం నుంచి కానీ సుందరకాండ నుంచి కానీ చూసి చదువుకోవచ్చు. కొన్ని శక్తిమంతమైన మంత్రాలు అన్ని వేళల చదువుకునేవి కావు కాబట్టి ఇక్కడ మంత్రాన్ని ఇవ్వడం జరగలేదు. జయ మంత్రం పఠించిన వారికి జయం తధ్యం !! జయశ్రీ రామ!! శుభం భూయాత్!!!! జై శ్రీరామ్! జై హనుమాన్!
ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం