Guruvayur Temple History In Telugu : కేరళ రాష్ట్రంలోని గురువాయూర్‌లో ఉన్న చిన్ని కృష్ణుని విగ్రహం ద్వారక నుంచి వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ దేవుని గురువాయురప్ప అని భక్తితో పిలుచుకుంటారు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణావతారం కూడా పరిసమాప్తి అవుతుంది. కృష్ణావతారం ముగిసిపోగానే మహాప్రళయం వచ్చి ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఆ సమయంలో సముద్ర జలాలలో తేలియాడుతూ వస్తున్న స్వామి విగ్రహాన్ని గురువు అంటే బృహస్పతి, వాయువు కలిసి కేరళలోని త్రిసూర్ ప్రాంతానికి తీసుకు వచ్చి ప్రతిష్ఠిస్తారు. గురువు వాయువు కలిసి ప్రతిష్టించారు కాబట్టి గురువాయూర్ అని స్థానిక భాష ప్రకారం 'అప్ప' అంటే తండ్రి కాబట్టి ఇక్కడ కృషునికి గురువాయూరప్ప అనే పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
ఆలయ పౌరాణిక నేపథ్యం
గురువాయూర్‌లో విగ్రహం ప్రతిష్టించిన తర్వాత గురువు, వాయువు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందుకు అంగీకరించిన విశ్వకర్మ గురువాయూరప్పకు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడంట! మహాభారతంలోని ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారతంలో దత్తాత్రేయ స్వామి గురువాయూర్ వైభవం గురించి పరీక్షిత్ రాజ కుమారుడు జనమేజయుడికి వివరించినట్లుగా ఉంది.
మహిమాన్వితుడు గురువాయూరప్ప
గురువాయూరప్ప అత్యంత మహిమాన్వితుడనీ, సాక్షాత్తూ శ్రీకృష్ణుడే ఇక్కడ వెలసినట్లుగా ప్రజల విశ్వాసం. బ్రహ్మదేవుడు నుంచి తన అర్చా మూర్తిని స్వయంగా అందుకున్న శ్రీకృష్ణుడు, తన స్నేహితుడైన ఉద్ధవుడికి దానిని అందజేయగా, ప్రళయ సమయంలో ఆయన నుంచి చేజారిన ఆ మూర్తిని గ్రహించిన గురువు- వాయువు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి గురువాయూరప్పే కృష్ణుడని అందుకే ఈ క్షేత్రానికి ఇంతటి మహత్యం అంటారు.
దీర్ఘకాలిక అనారోగ్యాలను పోగొట్టే గురువాయూరప్ప
గురువాయూరప్ప మహా వైద్యుడు అని భక్తుల విశ్వాసం. ఈ స్వామిని మనసారా వేడుకుంటే చాలు దీర్ఘ వ్యాధులు నయమైపోతాయని ప్రజలు నమ్ముతారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు గర్భాలయంలోని మూల మూర్తిని చూస్తూ, తాము ఏ వ్యాధితో బాధపడుతున్నది చెప్పుకుంటే చాలు ఆ వ్యాధుల నుంచి స్వామి విముక్తిని కలిగిస్తాడని చెబుతారు.