ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / spiritual

గురుపౌర్ణమి పేరు ఎలా వచ్చిందో తెలుసా! గురుపౌర్ణమి రోజు ఏం చేయాలి? - what is GURU POURNAMI SPECIAL - WHAT IS GURU POURNAMI SPECIAL

GURU POURNAMI 2024 SPECIAL: ప్రతి పండుగకీ ఒక సంప్రదాయం, విధానం ఉంటుంది. ఫలానా దేవుని పూజించాలి, ఫలానా రీతిలో పూజలు చేయాలన్న ఆచారం హిందూ సమాజంలో ఉంది. కానీ గురుపౌర్ణమి అలా కాదు! గురుసమానులైనవారికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే గురుపౌర్ణమి అనేది వేర్వేరు రూపాలలో సాగుతుంది. అసలు గురుపౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా!

GURU POURNAMI 2024 SPECIAL
GURU POURNAMI 2024 SPECIAL (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 1:40 PM IST

GURU POURNAMI 2024 SPECIAL: ఆషాఢమాసం తొలి పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన రోజు! అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. అందుకే ఆ రోజు విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించవచ్చు. కానీ ఆ రోజు వాళ్లను కాకుండా గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ రాక మానదు. అందుకు మన పెద్దలు చెప్పే కారణాలు, అంశాలు ఏమిటంటే?

వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యారు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి విశేషమైంది. వ్యాసుడు అనేవాడు వీటిని రచించకపోతే హిందూ ధర్మశాస్త్రాలు అనేవి ఉండేవా? అన్న అనుమానం కొన్నిసార్లు వస్తోంది. అయితే ఇన్ని పనులూ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా! అందుకే వ్యాసుడు అనే పేరు ఒక వ్యక్తి నామం కాదనీ, వ్యాసుడు అనేది ఓ బిరుదనీ కొందరు అంటారు.

అందుకే జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ రూపంలో ఉన్నా, వారిని వ్యాసుడని, వ్యాసమహార్షిని పిలిచేవారట. బహుశా అందుకే వ్యాసుడిని మరణం లేనివాడుగా మన పురాణాలు చెబుతున్నాయి. అలా మన జ్ఞానాన్ని రక్షించే గురువులు, తరగని జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న వారు సాక్షాత్తూ ఆ వ్యాసుడి రూపాలు. అందకే ప్రతి వ్యాసపౌర్ణమి నాడు, మన కళ్ల ముందున్న గురువులను, పెద్దవారిని దైవ సమానులుగా భావించి పూజిస్తూ, నమస్కరిస్తూ ఉంటాం.

గురుపౌర్ణమి ఎలా జరుపుకోవాలి? గురువుకు పసుపు రంగుకు ఏంటి సంబంధం? - Guru Purnima 2024

దర్శించుకునేది ఎలా?: ఇక వ్యాసపౌర్ణమి రోజు గురువులను ప్రత్యేకంగా పూజించేందుకు ఓ కథ కూడా వ్యాప్తిలో ఉంది. పూర్వం వారణాసిలో ‘వేదనిధి’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు ‘వేదవతి’. ఆ దంపతలకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని, తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతారు. వేదవతి, వేదనిధిల భక్తికి మెచ్చిన వ్యాసమహర్షీ ఆ దంపతులకు సంతానం భాగ్యం దక్కేలా ఆశీర్వదించారు.

ఆ దంపతులు వ్యాసుల వారిని విడిచివెళ్తూ ‘మేము కోరుకున్నప్పుడ్లలా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా?’ అని అడిగారు. అందుకు వ్యాసుడు ‘జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ ఉంటాననీ, అలాంటి గురువులను, తన పుట్టిన రోజైన వ్యాసపౌర్ణమినాడు పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని’ చెప్పారట. అలా ఆ రోజు నుంచి నుంచి వ్యాసపౌర్ణమినాడు గురువులను ఆ వ్యాసభగవానుగా తలచి కొలుచుకునే ఆచారం నడుస్తోంది.

దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం:గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమికి చాలా ఘటనలు చెబుతారు. బుద్ధుడు భోదివృక్షం కింద జ్ఞానోదయం సమపార్జించిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది కూడా గురుపౌర్ణమి ఈ రోజునే అని మరో కథనం వ్యాప్తిలో ఉంది. దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం చెంది సప్తర్షులకు ఉపదేశం చేసిందీ కూడా ఈ రోజునే అన్న ఇంకో కథనం! జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే అని కూడా చెబుతారు!

చాతుర్మాసవ్రతంలో భాగంగా గురువులంతా శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈ రోజే. ఎలా చూసినా గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్‌లో ఈ రోజుని టీచర్స్‌ డేగా అధికారికంగా జరుపుకొంటారు. మన దేశంలో మాత్రం ఈ రోజును గురుపౌర్ణమిగా గురువులను పూజించడం ఆచారంగా వస్తోంది. అలా వ్యాసపౌర్ణమిని గురుపౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట!

మహాశివుడి "కావడి యాత్ర" - ఈ యాత్ర గురించి మీకు తెలుసా? - జన్మజన్మల పాపాలన్నీ నశించిపోతాయి! - Kanwar Yatra 2024 Dates

గురుపౌర్ణమి రోజు ఏం చేయాలంటే:గురుపౌర్ణమి వ్యాసభగవానుని జన్మదినం ఆశ్రమాలలో వ్యాసపూజ చేస్తారు. ఇందుకు 15 మంది ఆచార్యులను మూడు బృందాలుగా కూర్చోపెట్టి పూజిస్తారు. తొలి వరుసలో ‘కృష్ణ పంచకం’ అని పిలుస్తారు. కృష్ణుడు ఆయనకు నాలుగు దిక్కులా ఉన్న నలుగురు ముఖ్యశిష్యులకీ ఈ అయిదుగురినీ ప్రతిరూపం. అలాగే రెండో వరుసలో వ్యాస పంచకం, మూడులో అయిదుగురినీ శంకరాచార్య పంచకం అంటారు.

ఇంట్లో గురుపౌర్ణమి చేసుకోవాలనుకునేవారు విష్ణువు, శివుడు, దత్తాత్రేయులలో ఎవరినైనా పూజించవచ్చు. వ్యాసుడు సాక్షాత్తూ విష్ణుస్వరూపుడు. అందుకే విష్ణుసహస్రనామంలో ‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే’ అని కనిపిస్తుంది. విష్ణురూపాన్ని పూజిస్తూ విష్ణుసహస్రనామాన్ని జపిస్తూ ఈ రోజు గడపవచ్చు.

విష్ణువుకీ, శివునికీ ప్రతిరూపంగా దత్తాత్రేయుని ఆరాధించడమూ కనిపిస్తుంది. దత్తాత్రేయుడు గురురూపంలో అవతరిస్తూ ఉంటాడని నమ్మకం. శ్రీపాదవల్లభ, స్వామి సమర్థ, నృసింహ స్వామి వంటి దత్త అవతారాలని భావించి పూజిస్తారు. షిరిడీ సాయిబాబాని కూడా దత్తాత్రేయుని రూపంగానే భావిస్తారు. అందుకే ఈ రోజున సాయినామాన్ని జపించడం, సత్చరిత్ర పారాయణం చేయడం మూలంగా బాబా ప్రసన్నులవుతారని విశ్వసిస్తారు.

గురువంటే అజ్ఞానాన్ని దూరం చేసే దేవుడి ప్రతిరూపం. అందుకే వ్యాసభగవానుడు జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని చెప్పారు. అలా ఈ రోజున గురువులు, టీచర్స్‌, పండితులు వంటివారిని జ్ఞానానికి ప్రతిరూపాలుగా భావించి ఆరాధించుకోవచ్చు. పాదపూజ చేసి, వస్త్రాభరణాలను కానుకగా ఇచ్చి కృతజ్ఞతను చాటుకోవచ్చు. గురుపౌర్ణమి కృతజ్ఞతకు గుర్తుగా సూచించే పండుగ కాబట్టి ఉపవాసం ఉండాలని కానీ, జాగరణ చేయాలని కానీ, ఫలానా నైవేద్యాన్నే అందించాలని కానీ ఖచ్చితమైన నియమాలు లేవు. గురువు పట్ల శ్రద్ధే ఈ రోజు ఉన్న ఏకైక నియమం!

హనుమంతుడిని 'చిరంజీవి' అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? - why hanuman is chiranjeevi

ABOUT THE AUTHOR

...view details