Sri Mahalakshmi Avatharam : ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరో రోజు అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ మహాలక్ష్మీ అవతారం
శరన్నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.
మంగళ ప్రదాయిని
ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.
శ్లోకం
"యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే "నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.