Friday Masa Shivaratri Puja In Telugu :వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి పూజ చాలా విశిష్టమైనది. ముఖ్యంగా శ్రావణమాసం సమీపించే ముందు వచ్చే మాస శివరాత్రి రోజు నియమానుసారం శివారాధన చేస్తే దారిద్య్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని విశ్వాసం. ఈసారి శుక్రవారం మాసశివరాత్రి రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి పూజ ఏ రోజు చేస్తారు?
అమావాస్య ముందు ఏ రోజైతే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చతుర్దశి తిథి ఉంటుందో, ఆ రోజును మాసశివరాత్రిగా జరుపుకుంటాం.
మాస శివరాత్రి పూజకు శుభసమయం
ఆగస్టు 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3:27 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు మాస శివరాత్రి పూజకు శుభ సమయం.
మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో శివయ్యను అభిషేకించాలి. తర్వాత శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.
సంధ్యాసమయం పూజ
సాయంత్రం సంధ్యా సమయం అయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ పూర్తి చేసుకుని సమీపంలోని శివాలయానికి వెళ్లి ఆలయంలో జరిగే శివాభిషేకాలు, అర్చనలలో పాల్గొనాలి. శివునికి 11 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పూజారికి దక్షిణ తాంబులాలు ఇచ్చి నమస్కరించుకోవాలి.
ఉపవాస విరమణ
శివాలయం నుంచి ఇంటికి వచ్చి ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే మాస శివరాత్రి పూజ సంపూర్ణం అవుతుంది.