తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దత్త జయంతి ఎప్పుడు? ఎలా పూజిస్తే మంచిది? అసలు విశిష్టత ఏమిటి? - DATTA JAYANTI 2024

త్రిమూర్తుల స్వరూపం దత్త జయంతి విశిష్టత ఇదే!

Datta Jayanti
Datta Jayanti (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Datta Jayanti Significance : పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు, పుణ్య తిథులు ఉన్నాయి. ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే గుర్తొచ్చేది దత్త జయంతి. త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించే దత్తాత్రేయుని ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి? దత్త జయంతి విశిష్టత ఏమిటి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దత్త జయంతి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:19 గంటలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:37 గంటల వరకు ఉంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య పండుగలకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ 14 వ శనివారం తేదీనే దత్త జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.

దత్త జయంతి విశిష్టత
వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. అత్రి మహర్షి అనసూయ దంపతుల వర పుత్రుడే దత్తుడు. మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనని విశ్వాసం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు.

దత్త జయంతి పూజా విధానం
దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సంప్రదాయం. దత్తజయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచియై పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో. అలంకరించాలి పూజా మందిరములో రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఈ రోజు పూజ చేసుకునే వారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభకరం.

స్తోత్రాలు - ప్రసాదాలు
దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న చిత్ర పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ గంధం, పసుపు రంగు పుష్పాలు అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలు పెట్టాలి. దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తిశ్రద్ధలతో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, కేసరి బాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి. ఈ రోజు గురు చరిత్ర, శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణం చేయడం శుభప్రదం.

ఆలయాలలో ఇలా
ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు దేవాలయాలలో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి వెంట ఎల్లప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఈ నాలుగు నాలుగు వేదాలకు చిహ్నమని విశ్వాసం. అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈ రోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది. విశేషించి ఈ రోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా, విన్నా శుభం జరుగుతుంది.

భక్త సులభుడు
భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరం లేదు. మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికి ఇచ్చే సందేశం. అందుకే దత్తాత్రేయుని గురువుగా భావించి పూజించి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. రానున్న దత్త జయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details