Dasara Navaratri Celebrations 2024 :హిందువులందరూ శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు దేవీ నవరాత్రుల కోసం ఎంతో అందంగా ముస్తాబవుతోన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై.. అక్టోబర్ 12వ తేదీన ముగియనున్నాయి. అయితే, చాలా మంది నవరాత్రుల సమయంలో అమ్మవారికి పూజ చేస్తుంటారు.
దుర్గామాతని ఆరాధించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, ఇంట్లో వాళ్లందరూ సుఖంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఉపవాసం ఉండే వారు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించదు. అయితే, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి సేవలో ఉండే దుర్గాదేవీ భక్తులు ఎటువంటి తప్పులు చేయకూడదో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
దసరా నవరాత్రుల్లో చేయకూడని తప్పులు..
- చాలా మంది అమ్మవారి పూజకు కావాల్సిన సామాగ్రిని పాడ్యమి రోజు (అక్టోబర్ 3వ తేదీ)న తెలియక తెచ్చుకుంటారు. కానీ, ఇలా చేయకండి. ముందు రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం తెచ్చుకోండి.
- నవరాత్రుల్లో పూజ చేసేవారు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది. చన్నీళ్లతో స్నానం చేయలేని వారు.. గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకండి.
- కొంతమంది శరన్నవరాత్రుల్లో కఠిన ఉపవాసం ఉంటుంటారు. దేవీ భాగవతం ప్రకారం.. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వారు కఠిన ఉపవాసం ఉండకూడదు. ఒకపూట ఆహారం స్వీకరించవచ్చు. ఇంకా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
- దేవీ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం మీద పడుకోకూడదు. అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు. వయసు సహకరించని వారు, అలాగే ఆరోగ్యం బాగాలేనివారు, వయసు పైబడిన వారు మంచం మీద పడుకోవచ్చు. కానీ, పాత దుప్పటి తీసేసి.. కొత్త దుప్పటి వేసి పడుకోవాలి. ఇలా చేస్తే దోషం ఉండదు.
- అమ్మవారికి పూజ చేసే వారు పొలిమేర దాటకూడదు. అలాగే ఏరు లేదా నది దాటకూడదు.
- నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా పలకరిస్తే కోపగించుకోకూడదు. అలాగే ఇంట్లో గట్టిగా అరవడం, పెద్దవాళ్లను తిట్టడం చేయకూడదు. ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదని దేవీ భాగవతంలో చెప్పారని అంటున్నారు. అలాగే విసుక్కోకుండా కూల్‌గా ఉండాలి.
- నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వారు రజస్వల దోషాలున్నటువంటి మహిళలను తాకకూడదు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ దేవి నవరాత్రుల్లో పూజ చేసే వారు.. మాంసాహారం తినకూడదు. పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి.
- మహిళలు గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోకూడదు. అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుందట!
- నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసే వారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, చద్దన్నం తినకూడదు. ఈ నియమాలు పాటిస్తూ నవరాత్రుల్లో పూజ చేస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొంటున్నారు.