శరన్నవరాత్రులకు బెజవాడ దుర్గమ్మ సిద్ధం- ఏ రోజు ఏ అవతారంలో దర్శనమివ్వనుందంటే? - Dasara Navaratri 2024 - DASARA NAVARATRI 2024
Dasara Navaratri Avatars In Telugu 2024 : దసరా నవరాత్రులకు సమయం దగ్గర పడుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు ఏ రోజు అవతారంలో, ఏ అలంకరణలో దర్శనమివ్వనున్నారు అనే వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కనకదుర్గమ్మ తల్లి నిజంగా చల్లని తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లిని ప్రార్ధిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్ఠలు ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దుర్గమ్మ. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చనని శాస్త్ర వచనం. ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ప్రతిరోజూ చేసే అలంకరణ విశేషాలు గురించి తెలుసుకుందాం.
దసరా ఉత్సవాలు ఎప్పుడు? Dasara Navaratri Avatars In Telugu 2024 : ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 అక్టోబర్ 03వ తేదీ గురువారం ఘట స్థాపనతో మొదలై, అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో తొమ్మది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఏ రోజు ఏ అలంకారం?
తేదీ
రోజు
తిధి
అలంకారం
3/10/2024
గురువారం
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం
4/10/2024
శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ విదియ
శ్రీ గాయత్రీ దేవి అలంకారం
5/10/2024
శనివారం
ఆశ్వయుజ శుద్ధ తదియ
శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
6/10/2024
ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
7/10/2024
సోమవారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ మహా చండీ దేవి అలంకారం
8/10/2024
మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్ఠి
శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం
9/10/2024
బుధవారం
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, సప్తమి
శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
10/10/2024
గురువారం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అష్టమి
శ్రీ దుర్గా దేవి అలంకారం (దుర్గాష్టమి )
11/10/2024
శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నవమి
శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహర్నవమి)
12/10/2024
శనివారం
ఆశ్వయుజ శుద్ధ దశమి
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం (విజయదశమి
చివరి రోజైన శనివారం రోజు అమ్మవారు ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది. నవరాత్రులలో అమ్మవారి దర్శనం శుభకరం. అన్ని రోజులు కాకున్నా తొమ్మిది రోజులలో ఒక్క రోజైన దుర్గమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది. తేదీలు, అలంకారాలు అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా! అమ్మవారి దర్శనం కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.