Dakshinayana Punyakalam 2024 :ఆర్యభట్ట రచించిన ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్థం. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం ఉంటే మరో 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది దక్షిణాయన పుణ్యకాలం ఎప్పుడంటే?
ఈ ఏడాది జులై 16వ తేదీ కర్కాటక సంక్రమణం ఉదయం 11:18 నిమిషాలకు మొదలవుతుంది. ఈ సమయం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అయితే సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిమిషాలకు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాల్లో చెప్పారు. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.
ఆధ్యాత్మిక ప్రాధాన్యం
ఆధ్యాత్మికంగా చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలు అయితే, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. దక్షిణాయన సమయంలో మానవ మనుగడకు దైవశక్తి ఎంతో అవసరం. అందుకే ఈ కాలంలో ఉపాసకులు దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఉపాసనలు చేస్తారు. అందుకే ముఖ్యమైన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. శ్రీహరి ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
దక్షిణాయనంలో ఉపాసనల వెనుక శాస్త్రీయత
శాస్త్రీయ పరంగా చూస్తే భూమిపై సూర్యకాంతి తగ్గే ఈ ఆరు నెలల కాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. అందుకే ఉపాసనల పేరుతో పాటించే ఆహార నియమాలు, ఇతర ఆంక్షలు శారీరకంగా ఉత్తేజం కలిగించి మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ కాలంలో పాటించే బ్రహ్మచర్యం, భగవద్ ఉపాసన, పూజలు, వ్రతాల పేరుతో తరుచుగా ఉపవాసాలు, పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
పితృదేవతారాధనకు శ్రేష్టం
ముఖ్యంగా దక్షిణాయనం పితృదేవతారాధనకు ఎంతో శ్రేష్టం. ఈ కాలంలో వచ్చే మహాలయ పక్షాలు పితృ తర్పణాలు, శ్రాద్ధాలకు విశేషమైనది. పితృదేవతలను శ్రాద్ధ తర్పణలతో సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం ఎంతో ముఖ్యం. ఇది శుభప్రదం కూడా! పితృ రుణం తీర్చుకోవడానికి అది ఒక్కటే మార్గం.
దక్షిణాయనంలో పాటించాల్సిన విధి విధానాలు
దక్షిణాయనంలో కుటుంబ సౌఖ్యం కోసం, వంశాభివృద్ధి కోసం, ఐశ్వర్యం కోసం తప్పకుండా ఈ విధి విధానాలు పాటించి తీరాలి.
జపతపాలు, ధ్యానాలు
దక్షిణాయనం జరిగే ఆరు నెలల కాలం సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, సంధ్యా వందనాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం వలన జన్మాంతర పాపకర్మల తొలగిపోతాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. సాత్వికాహారం అంటే శాఖాహారం తీసుకోవడం వలన కోపావేశాలు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.