Chandra Dosha Nivarana Mantra In Telugu :వరాహ మిహిరుడు, ఆర్యభట్ట రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే, అవి పోగొట్టుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలను నివారించడానికి, ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించడానికి, జాతకంలో చంద్ర దోష నివారణకు ప్రతి సోమవారం శివ పూజ చేయాలని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.
సోమవారం శివోహం!
హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం శివుని ఆరాధనకు శ్రేష్టం. ఈ రోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా జాతకంలో చంద్ర దోషం కారణంగా ఏర్పడే మానసిక సమస్యల నివారణకు ప్రతి సోమవారం నెలవంకను శిరస్సున ధరించిన శివయ్యను నియమనిష్టలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం .
సోమవారం శివపూజకు నియమాలు
చంద్ర గ్రహ దోషం కారణంగా ఇబ్బందులు పడేవారు సోమవారం ఉదయాన్నే తలారా స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని సమీపంలోని శివాలయానికి వెళ్లాలి.
శివాలయంలో పూజ
శివాలయంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. ఆవుపాలతో అభిషేకించిన తరువాత గంగాజలంతో కూడా అభిషేకించాలి. అనంతరం శివలింగాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. తెల్లని మల్లెపూలు, జాజిపూలు, నంది వర్ధనాలతో శివయ్యని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. కొబ్బరికాయ కొట్టి, కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి.