తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దేవీ నవరాత్రుల నుంచి దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో పండగలే పండగలు! - Ashwayuja Masam 2024 - ASHWAYUJA MASAM 2024

Ashwayuja Masam 2024 Festivals : ఆశ్వయుజ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆశ్వయుజ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో దేవీ నవ రాత్రులతో పాటు మరెన్నో విశేషాలు ఉన్నాయి. మరి ఈ మాసంలో ఇంకా ఎలాంటి పండుగలు, వ్రతాలు రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Ashwayuja Masam 2024 Festivals
Ashwayuja Masam 2024 Festivals (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 5:02 AM IST

Ashwayuja Masam 2024 Festivals : తెలుగు పంచాంగం ప్రకారం మొదటి నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిన మాసం ఆశ్వయుజ మాసం. ఒక విధంగా చూస్తే ఇక్కడ నుంచి కొత్త సంవత్సరం ఆరంభమైనట్లే. తెలుగు మాసాలలో మొదటి మాసమైన చైత్ర మాసంలో ఎలాగైతే వసంత నవరాత్రులు వస్తాయో అలాగే మొదటి నక్షత్రం అయిన అశ్విని పౌర్ణిమతో కూడిన ఆశ్వయుజ మాసంలో కూడా శరన్నవరాత్రులు పేరిట దేవీ నవ రాత్రులను జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులతో పాటు ఇంకా ఏ ఏ పండుగలు, పుణ్య తిధులు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆశ్వయుజ మాసం ఎప్పుడు?
అక్టోబర్ 3వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ఆశ్వయుజ మాసం మొదలై తిరిగి నవంబర్ 1వ తేదీ ఆశ్వయుజ బహుళ అమావాస్యతో ముగుస్తుంది.

పర్వదినాలు - విశేషాలు
అక్టోబర్ 3 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి: ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతాయి. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులను అలరిస్తారు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.

అక్టోబర్ 4 ఆశ్వయుజ శుద్ధ విదియ : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 -11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు.

అక్టోబర్ 5 ఆశ్వయుజ శుద్ధ తదియ : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనంపై శ్రీవారు విహరిస్తారు.

అక్టోబర్ 6 ఆశ్వయుజ శుద్ధ చవితి: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీలలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరిస్తారు.

అక్టోబర్ 7 ఆశ్వయుజ శుద్ధ పంచమి: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహా చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది. అలాగే ఈ రోజు ఉపాంగ లలితా వ్రతం కూడా దేవీ ఉపాసకులు జరుపుకుంటారు.

అక్టోబర్ 8 ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది.

అక్టోబర్ 9 ఆశ్వయుజ శుద్ధ షష్టి, సప్తమి మూలా నక్షత్రం: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజ వాహన సేవ జరుగుతుంది.

అక్టోబర్ 10 ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అష్టమి : దుర్గాష్టమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది.

అక్టోబర్ 11 ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నవమి : మహర్నవమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు.

అక్టోబర్ 12 ఆశ్వయుజ శుద్ధ ఆశ్వయుజ శుద్ధ దశమి: విజయదశమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం, అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.

  • అక్టోబర్ 13 మధ్వాచార్య జయంతి, స్మార్త పాశాంకుశ ఏకాదశ
  • అక్టోబర్ 14 వైష్ణవ పాశాంకుశ ఏకాదశి, పద్మనాభ ద్వాదశి
  • అక్టోబర్ 15 భౌమ ప్రదోషం
  • అక్టోబర్ 16 కోజాగరి పౌర్ణమి
  • అక్టోబర్ 17 వాల్మీకి జయంతి, తులా సంక్రమణం
  • అక్టోబర్ 20 అట్లతద్ది, సంకష్టహర చతుర్థి
  • అక్టోబర్ 27 సర్వేషాం రమాఏకాదశి
  • అక్టోబర్ 28 సర్వేషాం గోవత్స ద్వాదశి
  • అక్టోబర్ 29 ధనత్రయోదశి, యమ దీపం, దీప దానం, భౌమ ప్రదోషం
  • అక్టోబర్ 30 మాస శివరాత్రి
  • అక్టోబర్ 31 నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, ధన లక్ష్మీ పూజ
  • నవంబర్ 1 ధర్మ అమావాస్య, కేదార గౌరీ పూజతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది.

పరమ పవిత్రమైన ఆశ్వయుజ మాసం దేవీ ఆరాధనకు విశిష్టమైనది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీస్సులతో, ఆ దుర్గాదేవి అనుగ్రహంతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ దుర్గాయై నమః ఓం నమో వెంకటేశాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details